పుట:పంచతంత్రి (భానుకవి).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అయ్యవసరంబున నతిజవంబునం జన నొక్కవిపినప్రదేశంబునఁ
బ్రమాదవశంబున నెరకలుఁగులో సంజీవకంబు కాలువిఱిగిన నతండు ధనవం
తుం డగుటఁ జేసి వెండియు నొకవృషభంబుఁ బుచ్చుక తచ్ఛకటంబున నమ
రించుకొని.

64


ఉ.

పోవుచు వర్తకుండు వృషపుంగవురక్ష యొనర్ప నొక్కనిన్
గావలి నిల్పి వాని కధికంబగు విత్త మొసంగె నత్తఱిన్
జీవము వోవకుండఁ గృపచేఁ దృణవారి యొసంగి వేడ్క సం
జీవకుఁ బుండరీకములచేఁ బడకుండగఁ బ్రోచె నాతఁడున్.

65


వ.

ఇవ్విధంబున వర్తకభృత్యుండు పెద్దకాలంబు నావృషభంబును
గాచి వేసటంబొంది కాలురాకునికి నాసంజీవకుని విడిచి, చని వాఁ డది మృతిం
బొందె నని వర్థమానున కెఱింగించిన నతండును నయ్యనడ్వాహమ్ము
పిత్రార్జితంబగుటం జేసి విషాదంబు నొందె నంత నక్కడ.

66


క.

జొంపములు గొనిన పచ్చిక
గుంపులు మే సచట వృషభకుంజరుఁ డనుమో
దింపుచుఁ జరణము దట్టి చ
రింపఁదొడఁగె వనమునందు రేపును మాపున్.

67


ఉ.

వారణరాజకుంభమును వ్రక్కలుజేసి తదీయరక్తముల్
సారెకుఁ గ్రోలిక్రోలి సరసంబగు మాంసము మెక్కి తుంది లా
కారబలంబునన్ మృగనికాయము దిక్కుల మీఱి గర్వవి
ద్యారుచిఁ బొల్చుఁ బింగళకుఁ డన్మృగవల్లభుఁ డవ్వనంబునన్.

68


వ.

విలసిల్లుచుండి యతం డొక్కనాఁడు సమస్తమృగములు గొల్వ,
యమునాసమీపమ్మునఁ గ్రుమ్మరుచున్ బ్రళయకాలబలాహకగర్జాసన్నిభం
బగు సంజీవకు భయానకధ్వానం బాకర్ణించి కలుషితస్వాంతుండై తనలో
నిట్లనియె.

69


క.

తనభీతియుఁ దన నేరమి
తనధనహానియును దగిన తనమర్మంబున్
దనగృహరంధ్రం బెప్పుడు
ఘనునకు గోప్యముగవలయుఁ గరణికలక్ష్మా!

70