పుట:పంచతంత్రి (భానుకవి).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

మహిళారూప్య మనంగఁ బట్టణము రమ్య[ప్రాంశు]హర్మ్యావళీ
మహితోద్యానసరోవరప్రతతులన్ మాతంగవాహావళిన్
బహుఘంటాపథయంత్రవప్రపరిఖాప్రాకారకూపమ్ములన్
మహనీయం [బగుసప్తస]ప్తివిలసన్మార్గోప[రోధోన్నతిన్.]

58


గీ.

అందు వర్థమానుఁడను వర్తకుఁడు గలఁ
డతఁడు నేర్పుతో బెహారమాడి
వచ్చు లాభధనము వసుమతీసురదేవ
తార్పణమ్ము సేయు నాత్మఁ దనరి.

59


వ.

అతఁడు పెద్దయుఁ దనహృదయమ్మున నిట్లు తలపోసె.

60


క.

సిరులును ఘనవిభవముల,
స్థిరములు తనతోఁడ వచ్చుఁ జేసిన సుకృతం
బరయగ నది పరికింపగఁ,
బరసుఖకారణము నూత్నభరతాచార్యా!

61


క.

[జలదానో]కహగోవ్రజ
జలఫలదుగ్ధమ్ములట్ల సత్సంపదలున్
దలపంగఁ బరహితార్థమె
విలసిల్లు ధరాతలమున విఠ్ఠయలక్ష్మా!

62


సీ.

పుత్రపౌత్రకళత్రభోగభాగ్యస్వగా
                    త్రంబులు దలఁప నిత్యములు గావు
నమర విప్రులకు యోగ్యముగాని విత్తంబు
                    చోరనృపతులచేఁ [జూఱ] వోవు
పరహితమునకును బాథేయమగు పాత్ర
                    దానమ్ము భక్తియుక్తముగఁ జేయ
నని, యంత బేహారమున కేఁగ నూహించి
                    వర్థమానుండు సర్వార్థములను


గీ.

నింబలరఁ గూర్చికొని సంభ్రమం బెలర్పఁ
గదలి నందకసంజీవకంబు లనఁగ
వఱలు వృషభమ్ము లుభయపార్శ్వములఁ గట్టి
ధనికులగు మిత్రబాంధవజనులతోఁడ.

63