పుట:పంచతంత్రి (భానుకవి).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఏలా! నరునకుఁ దనయా
జాలము విద్యావిలాససత్యవచోల
క్ష్మీలలితమూర్తి యొక్కఁడ
చాలుం దలపోయ లక్ష్మసచివవరేణ్యా!

51


గీ.

చోరు లపహరింపలేరు భూపాలుర
వలని బాధ లేదు వాయువహ్ని
వారి[భయము] నొరయ దారయ విద్యాధ
నంబు వసుమతిన్ ధ్రువంబుగాదె!

52


క.

అయమార్గనీతివిద్యా
నయముల నేఘనుఁడొకో! పునర్జన్ములఁగా
నయ మొప్పఁజేయు నతిగ
ర్వయుతుల నానుతుల నతనువశదుర్మతులన్.

53


క.

అనిన నృపుఁ జూచి విద్వ
జ్జనవందితుఁడైన విష్ణుశర్మను విప్రుం
డనువేడ్క నాఱునెలలకు
ననఘా నీయాత్మజుల మహాత్ములఁ జేతున్.

54


వ.

అనిన నమ్మహీకాంతుండు నితాంతసంతోషమ్మున నతని నఖిల
వస్తుసంచయములం దేలించి నిజకుమారుల నర్పించిన నతండును వారలం
దోడ్కొని (యాత్మ)విద్యామంటపమునకుం జనుదెంచి మిత్రభేద, సుహృ
ల్లాభ, సంధి, విగ్రహ, లబ్ధనాశ, నాసంప్రేక్ష్యకారిత్వంబులను పంచతంత్రంబులు
కల్పించి యందుఁ బ్రథమతంత్రంబగు మిత్రభేదం బెఱిఁగించువాఁడై
యిట్లనియె.

55


చ.

చెలిమి యొనర్చినన్ గపటిచేఁ జెడుఁ దథ్యము తొల్లి కానన
స్థలమున సింహగోవిభులు చారుతరమ్ముగ మైత్రిఁ జేసి ని
శ్చలమతి నుండువేళ నొకజంబుకవల్లభుచే విరోధముల్
గలుగవె! యొండొకళ్లకనఁ, గౌతుకమానసులై కుమారకుల్.

56


వ.

మహాత్మా! యెవ్విధంబున........... నెఱింగింపుమనిన విష్ణు
శర్మయు వారల మనఃప్రియంబులం దెలిసి యా కథఁ జెప్పదొడంగె నది
యెట్లనిన మున్ను దక్షిణాపథమ్మున,

57