పుట:పంచతంత్రి (భానుకవి).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని తలపోయుచు మదిబొడ
మిన యద్భుతసాధ్వసంబు మృగసందోహం
బున కింతయు నెఱిగింపక
ఘనమగు గోప్యమున నుండెఁ గడుఁనే ర్పమరన్.

71


గీ.

తన్మృగేంద్రపరివృఢప్రధానసుతులు
గలరు ఫేరవభర్తలు కరటకుండు
దమనకుండన నీతివిద్యాప్రవీణు
లలఘుబలు లింగితజ్ఞులు ననఘమతులు.

72


వ.

తత్సమయంబున నయ్యిద్దఱిలో దమనకుండు కరటకుం గనుంగొని
యయ్యా! ఈమృగేంద్రుండు జలాభిలాషి యయ్యు మందసంచారుండై
యుండుటకుఁ గతం బెఱుంగుదే యన నతం డీయర్థమ్ము మనకుఁ దెలియం బని
యేమి యని యిట్లనియె.

73


క.

ధారుణి నెవ్వండ వ్యా
పారంబుల దిరుగుఁ [1]బ్రేతపతి? సదనంబున్
జేరు నతఁడు తరుచీలయు
వారక పెడబాపినట్టి వానరు భంగిన్.

74


సీ.

అనవుడు దమనకుం డది చెప్పుమనఁ గర
                    టకుఁడు ము న్నొక్కపట్టణసమీప
మునను దేవాలయంబునకుఁ గూర్చిన మ్రాను
                    వ్రయ్యలు వారంగ వైచి దాని
నడుమ చీల ఘటించి నరులేఁగఁ గానల
                    కరుగుచుఁ గపిసంచయమ్ము చేర,
నందొక క్రోతి [దిష్టాంతకప్రేరణఁ
                    దటుకునఁజీల] మీఁదటికి నురికి


గీ.

స్తంభవిరాంతరమునఁ గోళములు వ్రేల
పాణిదంతమ్ములను జీల బలిమి దించి
యుగ్రవథఁ బొందెనట్లు గాకుండ మెలఁగ
వలయు మతిమంతు లుచిత(స)ద్వర్తనముల.

75
  1. పితృపతి