పుట:పంచతంత్రి (భానుకవి).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాలనందున, వేంకటనాథ నారాయణ కవుల కావ్యములలో లేనిదియును భానుకవి కావ్యమునందు మాత్రమే యున్నదియునగు నొకకథఁ యిచ్చట బేర్కొనఁబడుచున్నది. అది యొక రాజకీరమునకును వేశ్యకును సంబంధించినదియై కైతవమును గైతవముచేతనే జయింపవలయునన్న యంశమును బ్రతిపాదించుచున్నది. భానుకవి గ్రంథమునఁ బ్రథమాశ్వాసాంతమున నిది కానవచ్చుచున్నది. ఈ కథ కదిరీపతి “శుకసప్తతి"లోఁ గలదు. దీనిని భానుకవి సరసముగ నిర్వహించెను.

వేంకటనాథునకు నీతివిషయ మాలంబనమాత్రము. కథావిస్తరణమునను, వర్ణనలను బ్రవేశ పెట్టుట యందును, స్వాతంత్ర్యమును వహించి యాతఁడు తన గ్రంథమునకుఁ గావ్యముద్రను హత్తించెను. బాలావబోధనఫలమై కథాచ్ఛలమునఁ బ్రవర్తిల్లిన నీతి ప్రపంచనమున, నీతని కావ్యగుణలోభము, ఉక్తి జటిలత్వమునకును, బ్రౌఢవర్ణనములకును నెడమిచ్చినది. కావ్యదృష్టిచే నివి సంభావ్యములే యగును.

నారాయణ కవి గ్రంథమును భానుకవి గ్రంథమును, గావ్యగుణములయందును బరిమాణమునందును వేంకటనాథుని కావ్యమునకుఁ గొండిక లయ్యును వివక్షితార్థమునందుఁ దాత్పర్యము గలవియై వాని ప్రయోజనమును నెరవేర్చుచున్నవి.

భానుకవి గ్రంథముకన్న నారాయణకవి గ్రంథము కథాపరిస్ఫుటత్వమునను, వర్ణనాపరిపోషమునను, సంభాషణలయందును నించుక వాసిగాఁ బొడకట్టుచున్నను, ఈ రెంటికిని శైలియందు సాదృశ్యము గలదు. ఆ సాదృశ్యము, అక్కసెల్లెండ్ర సాదృశ్యము వంటిది. నారాయణకవి గ్రంథములోని పద్యములే నాలుగు భానుకవి గ్రంథమునందును గానవచ్చుచున్నవి.

క.

పరదేశమె నిజదేశము
పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్
ధరణి నసాధ్యం బెయ్యది
పరమార్థం బిదియె నూత్నభరతాచార్యా!

70


క.

కులసతి రోయును జుట్ట
మ్ములు వాయుదు రొరులు కష్టపుం బలుకుల ని