పుట:పంచతంత్రి (భానుకవి).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

బంధురంబగు దారిద్య్రబాధచేతఁ
దన్ను దిట్టుక దుఃఖసంతాపుఁ డగుచు,
విధిని దూరుచు నొకనాఁడు వేఁగుఁబోక
నిద్ర నొందినవేళను భద్రముగను,

10


వ.

అధికతరదారిద్ర్యదుష్కృతాపహారియగు నొక్కదివ్యపురు
షుం డావైశ్యునిస్వప్నంబున వచ్చి, తనదేహశాంతులు తటిల్లతలన, నద్భు
తంబుగా నిలువంబడిన నావణిక్కు భయసంభ్రమంబుల నతనికిఁ బ్రణామంబుఁ
జేసిన నమ్మహాత్ముండును బ్రసన్నహృదయుండై యతనిం జూచి యోవత్స!
మీ తల్లియగు నిల నన్ను నీకడ కనుప వచ్చినవాఁడ, నీదారిద్య్రనాశంబు
సేయవచ్చిన యోగిశ్రేష్ఠుండ, నీవును నీనిలయంబున నొక్కదీపిక యమర్చు
కొని వేదికమీఁదఁ గూర్చున్న, భవదీయగృహంబునకు భిక్షార్థంబు మువ్వురు
భిక్షుకు లేతెంతురు. వారలం జూచినయప్పుడు కరుణారహితహృదయుండవై
హస్తమ్మున లగుడమ్ము సంధించుక యామువ్వుర వధింపుము, వారల
కాయంబుల యందుండి మూఁడుకొప్పెరల ధనం బేతెంచు, నది నీ కబ్బు
దానం జేసి నీదారిద్ర్యమ్ము సర్వమ్మునుం బోవు నిది నిశ్చితార్ధమ్ము తొలి
కొండకుఁ, జండకిరణుం డేతెంచుచున్నవాఁడు, ప్రభాతంబున నేఁ జెప్పినవిధం
బాచరింపుమని చెప్పి, యతండు తిరోహితుండయ్యె నయ్యవసరమ్మున,—

11


ఉ.

ఆతఁడు మేలుకాంచి హృదయమ్మున నద్భుత మందుచుండి ప్ర
ద్యోతనుఁ డైంద్రదిక్ఛిఖరిఁ దోఁచినయప్పుడె, తీర్ధమాడి ప్ర
ఖ్యాతిగ వేదికాసనమునందు సుఖాసనుఁడయ్యు, చేతుల
న్నాతతమౌసల మ్మొకటి యడ్డయియుండఁగ, నద్భుతంబుగన్.

12


చ.

కరముల దండమ్ము ల్మెరయఁ, గాయరుచుల్ వెలికుబ్బ, బాలభా
స్కరకిరణమ్ములన్ దెగడఁగా నరుదెంచిరి మందహాసభా
సురవదనారవిందులయి చూచుచు మువ్వురు భిక్షు, లంబరాం
తరమున నుండి నిర్జరులు ధాత్రిఁ జరింపగ వచ్చిరో! యనన్.

13


వ.

అయ్యవసరమ్మున నావణిక్కు నామువ్వురు భిక్షులం జూచి
స్వప్నంబు ......... యమదండంబునుం బోలిన భుజాదండంబున నమర్చియున్న
ముసలంబు నెత్తి భయంబు లేక యాభిక్షుకత్రయమ్ము వధియించునప్పుడు
వారలదేహమ్ములందుండి మూఁడు కొప్పెరల ధనం బుదయంబయ్యె నంత,—

14