పుట:పంచతంత్రి (భానుకవి).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆసమయమ్మునఁ బుష్పశ
రాసనసామ్రాజ్యలక్ష్మియన, శృంగారో
ద్భాసితమై, యది పర్యం
కాసనమునఁ బొల్చు దొరను [నాదటఁ] జేరెన్.

98


ఉ.

చన్నులమీఁది కొంగు దిగజారి వళిత్రయనాభు లేర్పడన్
గన్నులఁజూడ్కి [దొంతి] తొలికారు మెఱుంగుల నీనుచుండఁగన్
క్రొన్ననవింటిజోదు మదకుంజరమో యన డాసియున్న య
య్యన్నుఁ గడంకఁజూచె సురతాభిరతన్ రతిరూపశోభితన్.

99


వ.

అప్పు డయ్యిరువురు ననంగి పెనంగి కుసుమభల్లమల్లయుద్ధమ్ము
నకు సన్నద్ధులై గళరవహుంకారమ్ముల నిశాతబాణమ్ముల రదచ్ఛద
మ్ముల వషట్కారసంచయమ్ముల, దశాంగుళార్ధప్రయోగంబులం దలపడి
మదోద్రేకమ్మున, వీడె ముబ్బున నొడ లెఱుంగక, చందనకర్పూరకుంకుమ
పంకమ్ముల శరీరములు జొబ్బిల్ల, గంపవొడి యెడనెడ పైఁజల్లుకొనుచుఁ
బర్యంకతలం బుయ్యలలూఁగ, సకినలు రవళి సేయఁ, బాన్పుపైఁ బడి మదనకద
నంబుఁ జేసి పరిశ్రమంబున నిట్టూర్పు నిగడించుచు, ఘర్మకణమ్ములు గవాక్ష
రంధ్రనిర్గతమందపవనంబువలనఁ బాయుచు నంతకంతకు మహోత్సాహం
బులం జెలువొందియున్న సమయమ్మున, —

100


గీ.

జారభామిని పాదమ్ము జారి మంచ
తలముక్రింద నణంగిన ధవునిఁ దాఁక,
నపుడు రథకారుఁడని హృదయమున నెఱిఁగి,
చేటు వాటిల్లెనని చింత సేయఁదొడఁగె!

101


క.

ఆలోపల జారుఁడు నీ
లాలక! నాయందొ, ధవునియందో, నీకున్
మే లెపుడుఁ జెప్పుమన్ననుఁ,
గాలోచిత మెఱిఁగి పలికెఁ గడునే ర్పమరన్.

102


చ.

పతి పరికింప దైవ, మతిపాపము లొక్కటఁ బొందు జారసం
గతినని ధైర్యసంపదలఁ గాదె! తృణక్రియ ప్రాణముల్ తుదిన్
జతురతతోడ నంగనలు నాథులఁ గూర్తురు, సర్వలోకసం
గతముగ, నంచుఁ జెప్పి మఱి మానిని యిట్లను వానితోడుతన్.

103