పుట:పంచతంత్రి (భానుకవి).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చంద్రాధీనంబైన యాసరోవరరక్షకుల నీవలఁచితివి. ఆశశకంబులం
జంద్రుండు నిజశరీరమ్ముగాఁ దలంచు, నదియునుంగాక పవలెల్ల నమ్మహా
త్ముం డాకసమ్మున వర్తించు, నిశాసమయంబున నాచంద్రసరోవర
మ్మున వసియించి యుండు, నీవును నీపరిజనమ్మును నిదాఘకాలమ్మున
కోర్వలేక యాచంద్రసరోవరంబు ప్రవేశించుటకై పోవుచున్నవారు.
అచ్చటికిం బోయిన నీకును నీ పరివారమ్మునకు నాపద వచ్చు. చంద్రచిత్తం
బెఱింగి నే నీకుం జెప్పితి, నాహ్రదప్రవేశంబును, శశకమర్దనంబును, బరిహ
రింపుమని చెప్పిన విని, గజేంద్రు డతిభయమ్మున నిట్లనియె,—

50


సీ.

అజ్ఞానకృతమున నయ్యెఁ దత్కమలాక
                    రంబు పద్ధతి, యిట రామటన్న,
గజవల్లభునిఁ జూచి విజయుండు పల్కె, నీ
                    వరుదెంచి యందలి యమృతకరునిం
జూచి పొమ్మని, రాత్రి సొంపారఁ దన్ను దో
                    డ్కొని చని యా కొలఁకునకు డాసి
పానీయములలోనఁ బ్రతిబింబితుండగు
                    చంద్రునిఁ జూపఁ, దత్సమయమందు
వందన మ్మొనరించి యో వారిజారి!
తప్పులెల్లను లోఁగొను దయదలిర్ప,
నెన్నఁ డీవంక రామని యేఁగఁ, గాంచి
శశకసంచయ మాత్మ నుత్సాహ మొందె.

51


వ.

ఇ ట్లుపాయమ్మున విజయుండు గజమ్ములం దొలంగించి తనభర్త
యగు శిలీముఖున కవ్విధం బెఱింగించి సుఖంబుండిరి. అట్లు గావున నీ
దివాంధుం బేర్కొన నాపద లణంగవు. హీనాత్ముండు ప్రజాపరిపాలనంబున
కొప్పునే! యని వెండియు నిట్లనియె,—

52


చ.

చెనఁటి నబుద్ధిఁ జేసి గుఱిఁజేసినవారలు, నొత్తు రెంతయున్
బెనుపరి కూలవే! శశకపింజలముల్ మును పిల్లిచే ననన్
విని పతగమ్ము లెట్లనిన, వేడుకఁ జెప్పెను దొల్లి భూరుహం
బున వసియించి యుండుదు బ్రభూతకుతూహలమానసుండనై.

53