పుట:పంచతంత్రి (భానుకవి).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

దేవ! దంతిఘటల నీవనవీథుల
నడువకుండఁజేయ నాకు నేర్పు
గలదటన్న, నపుడు కౌతూహలస్వాంతుఁ
డగుచుఁ బలికె విజయు నవ్విభుండు.

44


క.

తడయక సేయుము విను, మె
క్కడ నీతివిదుండు దేశకాలవిభాగం
బడరఁగఁ దెలియును, నాతం
డిడుమలఁ గూడండు సిరియు నెంతయుఁ బొందున్.

45


క.

అని పల్క నాశిలీముఖు
పనుపునఁ ౙని విజయుఁ డపుడు భద్రేభములన్
గనుగొని చింతాకులుఁడై
తనహృదయములోన నపుడు దలపోసి తగన్.

46


క.

కాయం బల్పము, దంతిని
కాయము దానోత్కటంబు గావున, వినయో
పాయముననైన డాయ న
పాయము సేకుఱు నటంచుఁ బ్రజ్ఞాన్వితుఁడై.

47


వ.

విచారించి యొక్కభూధరశృంగం బెక్కి యోగజేంద్రా!
నీకు భద్రం బగు ననిన, నతండు నీ వెవ్వండవు! నీరాకకు గతం బెయ్యది నా కెఱిం
గింపు మన, నవ్విజయుం డిట్లనియె. గజపతీ! నేఁ జంద్రదూతను దన్మండల
మధ్యంబున విహరించుచుండు శశకవిభుండ, నాపేరఁ జంద్రుండు
శశాంకు డనిపించుకొనియె. నానాథుండగు చంద్రుఁడు నీతోఁడి సఖ్యం బపే
క్షించి, నన్ను నీసమ్ముఖమ్మున కనిపినవాఁడని వెండియు నిట్లనియె,—

48


క.

తలపోయ నిష్ఠురోక్తులు
పలికినఁ, దిట్టినను, భూమిపాలురకును వ
ధ్యులుగారు దూత లెందును,
బలభిన్నభభోగ! నూత్న భరతాచార్యా!

49


వ.

అట్లు గావున నే హిమకరునానతిం బలికెద, స్వపరశక్తి నెఱుం
గక యెవ్వండేని యజ్ఞానంబునఁ గార్యం బొనర్చు, నతం డాపదలం బొందు.