పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భావించి పలికె నోహో, ధావన మఱి యిచట వ్రాలుదమె యిందఱమున్.

18


చ.

సకలపధీనమానసుఁడు శాంతిసమగ్రుఁ డజాతశత్రుఁ డం
తకనిభసత్యుఁ డిష్టజనతాఘనతాపవిఘాతి సర్వమూ
షకములసార్వభౌముఁడు రసజ్ఞుఁడు ప్రాణముప్రాణ మాహిర
ణ్యకుఁ డిట నుండు నాయనదయామతి [1]నివ్వలవంతఁ బాడుదున్.

19


చ.

నిలువుఁడు నావిహంగములు నిల్చె బిలస్థలభూమి నంత న
క్కలకల మాలకించి పొడకట్టి యనాయగుణావృతాంగుఁ గే
వలసఖు జీవితప్రతిము వారితమత్సరు వీతరాగు ని
ర్మలుఁ బతగాగ్రణిం గని హిరణ్యకుఁ డశ్రువిమిశ్రితాక్షుఁడై.

20


చ.

పలికె సఖా యఖండనయపారగతుండవు దీర్ఘదర్శి వే
వలన విపత్తిఁ జేట్పడనివాఁడవు నిత్యసుఖానుయాయి వి
య్యలమట నీకు నె ట్లొదవెనయ్య విధాతకుఁ బాఁడిలేదుగా
నలయుఁ గదయ్య కర్మ మెటువంటిది చూడఁగదయ్య యక్కటా.

21


క.

అని వగచుహిరణ్యకుఁ గనుఁ, గొని చిత్రగ్రీవుఁ డనియె గూర్మిసఖా నా
యనుజీవు లలసి రేను, న్వనటం బెగ్గిలితి నఱుకు వలఁ గేవలమున్.

22


క.

ఏవాసరమున నెద్దెస, నేవయసున నెట్టికర్మ మేమఱఁ డెవ్వాఁ
డావాసరమున నద్దెస, నావయసున నట్టికర్మ మతఁడు భుజించున్.

23


క.

కలకాలము లే దలమట, కలకాలము లేదు సుఖము కాయము మోసం
గలిగిననటు గొన్నా ళ్ళీ, యిల నిటు గొన్నాళ్లు దీని కేలా వగవన్.

24


క.

దైవికము లైనపనులకు, వావిడువఁ డవార్యధైర్యవంతుఁడు నయరే
ఖావిభవ యెప్పు డటువలెఁ, గావలె నటు కాకపోదుగా యని తెలివిన్.

25


వ.

అనుచిత్రగ్రీవునకు హిరణ్యకుం డిట్లనియె.

26


క.

వేసట నొందక లఘువి, న్యాసంబున నూఱుయోజనము లరిగి సుఖ
గ్రాసమునఁ బొదలివత్తు వ, యో సఖ నీకెట్లు మోస మొదవెం జెపుమా.

27


క.

అక్కట యాపల్లతలం, జిక్కక నయసరణిఁ ద్రొక్కు చిత్రగ్రీవుం
డెక్కడ యీనిర్బంధన, మెక్కడఁ గాలముఁ దరింప నెవ్వరు నలఁతుల్.

28


క.

ఆపత్సంపద లలఁతులఁ, బ్రాపింపవు ఘనులగాని ప్రజ్ఞంబొడవై
చూపట్టుచంద్రుఁ [2]డారెం, డోపతగాధ్యక్ష కలవె యుడుసంహతికిన్.

29
  1. వలవంత = వలవలని బాధ
  2. ఆరెండు = ఆపత్సంపదలు రెండు