పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తమలోనఁ బొదరుకొని యు, ష్ట్రము వాకిట నిల్వఁబనిచి రహి నమ్మూఁడున్
సముఖమున కరిగె నం దుద, రముఁ జూపి యిభారితోఁ గరట మిట్లనియెన్.

494


క.

తిరుగఁగలదిక్కులన్నియుఁ, దిరిగితి మిఁక నేమి యలసితిమి మాపల్కు
త్తరు వాహా యాహారము, దొరకదు నిప్పస్తు లుండుదుమె నీమ్రోలన్.

495


ఉ.

లావరి యెప్పు డంగవికలత్వము వాటిలి క్రుస్సి యిమ్మహా
గ్రావగుహానివేశమునఁ గాల్కొని దేవర యుండ నెవ్విధిం
జీవిత ముండు భోజనము సేయకయే మును నిస్తరించు టె
ట్లావిధ మానతిమ్ము సుగుణార్ణవ యూరకయుండు టొప్పునే.

496


ఉ.

ఊరకయున్న నెట్లగు నిజోదరపూరణ మేటిజోలి యా
హారము లేదు మావలన నక్కట యే నొకమాటఁ జెప్పెదం
గోరికమీఱ నక్కథనకుం బొరివుచ్చి తదంగమాంసమ
జ్జారుణసేవ దేవ జఠరానల మార్పుము తేర్పు మాకృతిన్.

497


వ.

అని చెప్పిన నప్పని కొప్పనియదియై మదోత్కటంబు కరటంబున కిట్లనియె.

498


ఉ.

ఇట్టిది గాదె నీకుఁ దుది నేటికిఁ జెప్పెదు ధర్మతత్త్వముల్
చెట్టులఁ గట్టి నమ్ముమని చే తడియాఱదు చంపుటెట్లు దా
నెట్లు సహించు దైవ మిల నెవ్విధి మోయు ధరిత్రి యక్కటా
పొట్టకు గాఁగ నిచ్చె నఁటిపోకలఁ బోన మదిం దలంచినన్.

499


క.

ఉడుగు మిఁకను నట్లయినం, జెడితిమి నీసత్య మింత చేసె నయం బె
క్కడ బోధించిన దానిం, గడచెవులం గూర్పననుచుఁ గరటము మఱియున్.

500


క.

నిలుపోపరానియాఁకటఁ, బులి పిల్లల భుజగ మండముల భక్షించున్
గలుషములకు రోయునె నీ, తులు దలపోయునె బుభుక్షితుఁడు చిత్తమునన్.

501


ఉ.

ఏనిధి నీతిపద్ధతికి నేగు దయాపరతంత్రచిత్తుఁడై
కైవడినౌ మహదురితకర్ముఁడు గా కెటులుండు ధర్మసం
భావితుఁ డెట్లగు న్వినయపాటవ మేక్రియ నేర్చు గౌరవం
బేవలన న్భజించు సుఖ మేగతిఁ గాంచు బుభుక్షితుం డిలన్.

502


క.

కుక్షి దరికొన్నపట్టున, వీక్షించునె దేహి రుచులు వేళలు మునిహ
ర్యక్షము విశ్వామిత్రుఁడు, భక్షింపఁడె సారమేయపలలముఁ దొలుతన్.

503


గీ.

కలశజుఁడు చూడ నొకరాజు కానలోన, దండియాఁకటఁ దనమేను దానె తినఁడె
వఱపుతరిఁ బుణ్యధనులు గీర్వాణమునులు, చేరి పీనుఁగుఁ గఱిచి భక్షింపరోటు.

504