పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ప్రాణసమానుఁడవగునీకుఁ గప్పిపుచ్చరామిం జెప్పితి నిది నీమనమ్ముననె యుండనిమ్ము
నావిని సంజీవకుండు విషాదవిహ్వలుండై.

441


క.

ధర నిరవధిచింతాసం, భరమునవలె శిరము వంచి పరికించుగుణా
కరు సంజీవకుఁ గనుఁగొని, గురుమాయాశాలి దమనకుం డిట్లనియెన్.

442


క.

చింతానలమునఁ జేతః, కాంతారము గుమిలెఁ బ్రాప్తకాలము నారా
ధింతువుగా కన నతఁ డ, త్యంతధృతిస్ఫురితచిత్తుడై తనలోనన్.

443


చ.

కరిగమన ల్దురాత్మకులఁ గాని రమింపరు హీనజాతికా
పురుషులఁ గాని భూభుజులు ప్రోవరు కానలఁగాని మేఘము
ల్గురియవు సత్యశౌచములకుం బెడఁబాసినవానిఁ గాని యిం
దిర వరియింప దుర్వి యవనీతులగాని భరింప దెంతయున్.

444


క.

పలుగూఁత లఱచువానిన్, గలు ద్రావెడువానిఁ జెవులు గఱిచెడువానిన్
బొలఁతులఁ దెచ్చెడువానిన్, దొలగింపక సంతరింపుదురు రాజన్యుల్.

445


క.

ఏకగ్రీవముగా నా, లోకన మొనరించి నిచ్చలుం గొలిచి తుదిం
గా కెడసితిఁ గద కలవే, మో కటకట సత్యశౌచములు రాజులకున్.

446


చ.

నలినములంచు రేలు కొలనం కలహంసకులంబు రిక్క నీ
డలఁ గబళించి కాంక్ష మగుడం గడకేగి మనోజ్ఞగంధము
ల్చిలికెడుతమ్ములం బగలు చేరనిచాడ్పున మోసపోయి చం
చలులగువారి కెక్కడివి సత్యపదార్థములందు నమ్మికల్.

447


ఉ.

దోషగుణంబుఁ కూర్చి కుపితుండగు నాతఁడు ప్రార్థనావిధిం
దూషితుఁడై యభీష్టఫలదుండగు దోషములే కకారణ
ద్వేషముఁ బూనియున్న కుపతిం బ్రకృతిస్థునిఁ జేయఁ బ్రార్థనా
భాషలఁ గాదు సంశ్రయణభంగులఁ గాదు ఘటింప దీఁగులన్.

448


చ.

ఫలితచికిత్స రోగములఁ బాప శుభక్రియల న్మహాఘము
ల్పొలుపఱఁజేయ నీతిధనము ల్బహుభంగులఁ గూడఁబెట్టఁ
గేవల పరతంత్రులై మెఱయు వైద్యవిపశ్చిదమాత్యులుం ధరా
తలపతిఁ బాసిపోవుదు రతండు కృతజ్ఞుఁడు గాక యుండినన్.

449


చ.

లవణపయోనిధానసలిలంబు ఘనాఘనదేశసంగతం
బవుచు మనోజ్ఞతం బొరయు నమ్మధురాంబువు వార్ధిఁ జేరి యు
ప్పువుగతిఁ గుత్సితం బమలమౌ విమలం బతికుత్సితం బవుం
దవిలి మహోత్తమాశ్రయమున న్మఱి తుచ్ఛసమాశ్రయంబునన్.

450