పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతనికవిత్వములో లక్షణవిరుద్ధములగు ప్రయోగము లున్నవనియు, నందుచేతనే లక్షణకర్త లుదాహరణముగా నీతనికృతిఁ గొనకపోయి రనియు నందురు. ఈలక్షణవిరుద్ధప్రయోగము లెల్లగ్రంథంబులయందును గన్పడుచున్నని కాని యవి కొందఱియదృష్టంబుఁ బట్టి సాధువులుగను గొందఱిదౌర్భాగ్యముంబట్టి యసాధువులుగను సాధింపఁబడుచున్నవి. ఇతఁ డీపంచతంత్రంబును సంస్కృతమునకు భాషాంతరీకరణమువలెఁ గాక ప్రబంధశైలిలో వ్రాసినాఁడు. కవిత్వ మెట్లుండవలయునో యీతఁడే యీ పంచతంత్రమున,

"ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢము గాక ద్రావిడీ
స్తనగతిఁ దేట గాక యరచాటగు నాంధ్రవభూటిచొక్కపుం
జనుగవఁ బోలి తేటయును జాటుతనంబరు లేకయుండఁ జె
ప్పిన యదె పో కవిత్వ మనిపించు పగిం చటుగాక యుండినన్."

అనుపద్యముచేఁ జెప్పి యున్నాఁడు. తిలకింపుఁడీ!

కావ్యంబున నొక్కొక్కఁ డొక్కయిక్క నరయుచుండును. 'భిన్నరుచి ర్హి లోకః' అనునట్లు లోకంబునఁ బలువురు పలువిధంబు లగు రుచులు గలిగియుందుకు. దీనినే యీ వేంకటనాథుఁడు,

సీ.

"ఒకఁ డలంకారంబునకు వేడుక వహించు నొకఁడు వార్తాసమృద్ధికిఁ జెలంగు
నొకఁడు శబ్దస్ఫూర్తులకు మాయురే యను నొకఁ డర్థసృష్టికి నుత్సహించు
నొకఁడు రసాభోగతకు మస్తముఁ గదల్బు నొకఁ డుపమానచర్చికకు నలరు
నొకఁడు పదప్రౌఢిమకు నిచ్చలో మెచ్చు నొళఁడు జాతిశ్లాఘ కుబ్బుచుండుఁ


తే.

గామి చందానఁ దలవరి కరణి బధిరు, వలె దరిద్రునిగతి వాది పరిదిఁ గనక
కారు చాడ్పునఁ బరగు వైఖరిఁ గుజాతి, జాడ నిందఱి ముదలింపఁ జాలు టెట్లు.”

అని చాటియున్నాఁడు. 'అవిదితగుణాపి సత్కవిభణితిః కర్ణేషు వమతి మధుధారామ్' అన్నట్లు చవిఁ గొనుఁ డీపద్యమునందలి మాధుర్యము!

ఎట్టివానికృతియందును దప్పులుండక పోవు. ఉండినంతనే వానికృతికిఁగాని యాతనికిఁ గాని కళంక మాపాదింపరాదు. గుణపరీక్షణము చేయవలయుఁ గదా? రసపుష్టిఁ గనుగొనవలయుఁ గదా? దీనినే యీతఁడు,

"ఒప్పులు గలకృతిలో నొక, తప్పున్నను గడమ గాదు దానికిఁ గళలం
జొప్పడు శశికిఁ గళంకము, కప్పేర్పడి యేమి నిందఁ గావించె నొకో."

అని వక్కాణించె.