పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయక తప్పదు. ఇదియునున్గాక వేంకటనాథుఁడు దాను బూర్వకవులను స్తుతించుచు,

"హృదయ బ్రహ్మరథం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు
త్సదనాస్థానికిఁ దెత్తు మానసనభస్సంచారిఁ గావింతు హృ
ద్విదితక్షీరసముద్రఖేలనమునం దేలింతు నుత్కృష్టవ
స్తుదులం బ్రాజ్ఞుల దిక్కయజ్వ నమరేశు న్సోము శ్రీనాథునిన్.”

అని శ్రీనాథుని పేర్కొనియుండుటచే నీతఁడు 1450-వ సంవత్సరమునకుఁ బూర్వపువాఁడు కాఁడని స్పష్ట మగుచున్నది. మఱియును నీతఁడు తన జ్యేష్ఠపితృవ్యునిఁ గూర్చి చెప్పుచు, 'కుమారలింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు' అని చెప్పియున్నందునఁ గవి హిందువులకును మహమ్మదీయులకును యుద్ధములు జరుగుచున్న సమయంబున నుండు నని యేర్పడుచున్నది.

ఇతఁడు కవులందఱివలెనే దనకుఁ బ్రబంధరచనాకాలంబున భగవంతుఁడు స్వప్నంబున సాక్షాత్కరించినట్లు చెప్పియున్నాఁడు. ఇయ్యది పూర్వకాలంబునుండి యాచారముగ వచ్చుచున్నది. ఇందలి సత్యాసత్యంబు లప్పరమేశ్వరుఁడే యెఱుంగు.

ఈతఁడు తనకృతియగు నీపంచతంత్రంబును స్వప్నంబున సాక్షాత్కరించిన హరిహరదేవున కంకిత మిచ్చినాఁడు. తద్విషయంబును, నాహరిహరనాథునియందలి భక్తిపారవశ్యంబును,

"ఏ చనవు గలదు హరిహర, సాచిద్యము నొంద నన్యజనులకు మది నా
లోచింపఁ దిక్కయజ్వకు, నాచనసోమునకు మరియు నాకుం దప్పన్."

అని చక్కఁగ వక్కాణించెను. ఇక్కారణంబుననే యీతఁడు నెల్లూరిమండలనివాసిగా నుండనోపునని యూహింపవలసి యున్నది. కవి తా నేగుండలమువాఁ డైన నేమి యెందుఁ బుట్టిన నేమి యెందుఁ గిట్టిన నేమి యెందు జీవనంబు గడపిన నేమి తనపాండిత్యముచేఁ గీర్తిని గడించినఁ జాలును.

కవితామాధుర్యంబుచే శిరంబు లూపించినఁ జాలు. అతఁడు భారతభూమి నలంకరించిన వాఁడే యగు. ఈవిషయ మింతటితో విరమించి యితనికవిత్వముయొక్క ఫక్కిని గుఱించి కొంచె మాలోచింపవలయును.