పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

వేంకటనాథకవి

ఇమ్మహాకవి పంచతంత్రమును బద్యకావ్యమునుగా రచించి మిగులఁ గీర్తిని జేకొన్న మహనీయుడు. ఇతనియింటి పేరు బైచరాజువారు. ఇతనితాతతాత బైచభూపాలుఁడు. ఇందుచేతనే యీతని కీయింటిపేరు గల్గెనని తోఁచుచున్నది. ఇవ్విషయమునే పంచతంత్రమున,

"ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుఁడు బైచనృపాలుఁ డద్ధరి
శ్రీరమణీమనోహరుని తీవ్రయశస్స్రుతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్."

ఈబెచరాజుకుమారుఁడు తిరురులధరణీనాథుఁడు. ఇతనికుమారుఁడు వీరభద్రరాజు. ఇతనికిఁ బుత్రు లిరువురు. లింగభూపాలుఁడు, పర్వతరాజు. ఈపర్వతరాజునకుఁ బుట్టిన మువ్వురుకుమారులో నగ్రజుఁడే యీవేంకటనాథమహాకవి. ఇక్కారణముననే యీతనిఁ బర్వతరాజకుమారవేంకటనాథుఁ డనియు నందురు. పై పద్యమునుబట్టియే యీతఁడు క్షత్రియకులావతంసుఁడని తెల్లమగుచున్నది. ఈకవీశ్వరుఁడు తన్నుగుఱించి,

‘‘అసహాయసరసకవితా, రసికుఁడ వేంకటధరావరప్రభుఁడ గుణ
ప్రసవప్రకాండమదవ, ద్భసలాయితవిద్వదఖిలబంధువ్రజుఁడన్."

అని తనపాండిత్యగరిమంబును బేరుకొనియున్నాఁడు.

కవికాలము, దేశము నిర్ణయించుటలో గొప్పచిక్కు గలదు. పూర్వపుఁగవులు తమగ్రంథములలోఁ దమకాలమును దేశమును జక్కఁగాఁ జెప్పుకొనువారు కారు. అట్లు చెప్పియుండినచోఁ బీఠికాలేఖకుల యూహలకును జర్చలకును నెడము లేకుండెడిది. ఐనను నీతనికాలమును గుఱించి 'బ్రౌన్ దొరవారు' తరునిఘంటువునందు క్రీ॥శ॥ 1500 సంవత్సరప్రాంతమువాఁడని వ్రాసి యున్నారు. కాఁబట్టి యీకాలమునకుఁ బ్రమాణేతరము లగుపడువఱ కియ్యదియే యని నిర్ధారణ