పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతఁడు కృతిని రాజుల కిచ్చునభిప్రాయమందు విముఖుఁడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామమూర్తి కంకితమిచ్చి కీర్తిఁ గాంచిన బమ్మెర పోతనామాత్యునియనువునను, బీఠికాపురీకుక్కుటేశ్వరున కర్పించి తనకృతుల వాసి నొందిన కూచిమంచి తిమ్మకవివడువునను, మఱియు భగవదర్పణ మొనరించిన మహాకవులజాడ ననుసరించియే యీతఁడును రాజాంకితమునుగుఱించి,

"అతికుటుంబరక్షణాపేక్షఁ బ్రాల్మాలి, కృతులు మూఢభూమిపతుల కిచ్చి
చచ్చి నిరయమునకుఁ జనుకంటె హరిహరా, ర్పణముఁ జేసి సుగతిఁ బడయరాదె."

అని ఘోషించి యున్నాడు, చూచితిరే యీతని దైవభక్తి!!!

ఈపంచతంత్రమునే దూబగుంట నారాయణామాత్యుండును దెనిఁగించె. పద్యములలో భావసామ్య ముండకమానదు. కథ యొకటియే కదా? నారాయణామాత్యుఁడు సులభశైలిని వ్రాసినాఁడు. కాని యందుసైతము లక్షణవిశుద్ధములగు ప్రయోగములు లేకపోలేదు. వేంకటనాథుఁడుమాత్రము తాను గవిత్వ మెట్లుండవలయునని యొప్పఁజెప్పెనో యా చొప్పుఁ దప్పించక తగినచోటులం దనువయిన వర్ణనములను జేర్చి రచించినాఁడు. ప్రబంధమునం దుండఁదగిన వర్ణనములన్నియు నెట్టకేలకుఁ గల్పించి రసపోషణముఁ జేసి వాసిఁ గాంచినాఁడు. ఐనను లక్షణవిరుద్ధములగు ప్రయోగము లందందుఁ జూపట్టుచున్నవి. వానినెల్ల నిట వ్రాయఁబూనలేదు. 'ఱోటి కొక్కపాట, నోటి కొక్కమాట 'యనుసామెత మనకుఁ జిరపరిచితంబు కాదే. అట్లే సామాన్యముగఁ బాఠభేదముచే లక్షణవిరుద్ధములగు ప్రయోగములును గలిగియుండునని యూహింపవచ్చును. ఈదోషములను గృతికర్తనెత్తిపై వైచుట ధర్మమార్గమని యేరైన నెన్నఁబూనుకొనరని నానమ్మకము.

హంసవింశతికర్తయగు అయ్యలరాజు నారాయణామాత్యునివలె నీతఁడును స్వభావవర్ణనములం గడునేర్పున నలవరించి యున్నాఁడు. కొన్నింటి నీక్రింద నుదాహరించెద. గ్రంథమునందే తిలకింపనగు నని పాఠకమహాశయుల వేఁడెద.