పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వల దటు పోవ నిల్వు మన వాఁడు కృతాంజలియై కనుంగవం
జలజల నశ్రువు ల్దొరుగ సన్నుతిఁ జేసి యతీంద్ర యవ్విధిం
బలుకకు మెట్టులేనిఁ దృణభంగము నేఁ డట వైచి వచ్చెదన్.

227


క.

నా విని యతిబంధువుఁ డతి, పావనుఁగా వాని వగచి పనిచె నతండున్
వేవేగ నరిగి తృణ మొక, చో వైచి భజింపఁ దొంటిచొప్పున వచ్చెన్.

228


వ.

ఇట్టి యుపాయాంతరంబుల సంత్యక్తపరప్రత్యయస్థితికి విప్రపత్తి గలుగకుండఁ
గొండొకకాలంబు నమ్మఁదిరిగిన నెళవెఱుఁగక నేయిపూసినకత్తి యగుటఁ తెలియక
గోముఖవ్యాఘ్రం బగుట వివరింపనేరక యత్తులునం బరిగ్రహించి వసుగర్భ యగు
కంథఁ జేతికిచ్చి యలుఁగులఁ దిరుగుట గజంబును నురువులఁ బెంచుట మారుతభుగ్ద
ష్టుని భువనవికారం బగుట నగజారమణుని విలాసభాసమానం బగుట వెలయాలిని
దుర్గాభైరవపాలితం బగుట నవిముక్తస్థలంబును సరసం బగుట విద్వత్ప్రబంధం
బును ననుకరించి యచ్చెరువుసేయు చెరువునకు ననుష్ఠానార్థియె చనియె నయ్య
వసరంబున.

229


క.

అప్పాపజాతి మస్కరి, యెప్పుడు దనచేతి కిచ్చె నేమఱి మఱి వాఁ
డప్పుడ పోయె ఘనంబుగఁ, గప్పినతమి కంథ నొండుగంత న్గొనుచున్.

230


క.

బొంత గొని నిజనివాసము, పొంతకు నాషాఢభూతి పోవుట మదిలోఁ
జింతింపక నికటతటా, కాంతమునకుఁ జనిన యతని యతిఁ గన్గొనఁగన్.

231


సీ.

కఠినశృంగాగ్రసంఘటితలోహపలాశఘళఘళాత్కృతుల నక్రములు బెదర
నన్యోన్యసంపాతహతి వ్రస్సి ఫాలభాగమున శోణిత ముబ్బి కరుడుగట్టఁ
జించికాంగాకరోచిర్ధురాధౌరేయనేత్రాంతముల గొప్పనిప్పు లురుల
ఖురశిఖాటంకసంక్షుభితగోత్రోత్తిష్ఠదవనిరేణువుల నీరసలు గాఁగ


తే.

గళవినిర్గతఘోరభూత్కారనినద, మమితకేదారచరపతంగములఁ దఱుమఁ
బరమగర్వోన్నతములు రభ్రములు రెండు, చెఱువుకొమ్మనఁ గయ్యంబు సేయుచుండె.

232


క.

తిరుగక విఱుగక యాభీ, కరమేషము లాహవంబుఁ గావింపంగా
సరి రెంటినడుమ నెత్తురు, దొరిగెం ప్రవహించె నిలిచె దొప్పలు గట్టన్.

233


క.

ఆనెత్తు రానుతమి నచ్చో నొకజంబుకము నడుమఁ జొచ్చి తదీయా
మానవిసాణశిఖాహతి, చే నెమ్ములు విఱిగి సొరిగి జీవము విడిచెన్.

234


క.

జంబుకము మేషయుద్ధము, నం బడుట యనంగ నిడి జనస్తుత విను ము
ల్లం బమర మఱియుఁ జెప్పెదఁ, బంబినతాత్పర్యమేరుపడ సన్యాసిన్.

235


వ.

అట్లు స్వాపరాధంబున మేషవిషాణసంపాతసంఘాతంబునఁ గొలెమ్ములు విఱిగి కాల
మ్ము సేసిన సృగాలమాత్రముం జూచి యిట్టిద నావివేకంబు స్వప్నాద్యవస్థలయం