పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

సక్తుచూర్ణపాండూకృతుండును విషాదవిహ్వలుండును నయ్యె నిది మనోరథరాజ్య
పాలనఫలం బనిచెప్పి యప్పల్లవాధర సుముహూర్తంబునఁ గుమారు గాంచి
పంచమదివసంబున.

19


క.

అత్తులలేనికుమారునిఁ, బొత్తులలో మనిచి గూర్మిఁ బురుషుని రక్షా
వృత్తికి నియమించి ధరా, భృత్తులతోరోజ జననిగృహమున కరిగెన్.

20


క.

ఆలోఁ బెంపుడునకులము, బాలునకుం గాపువెట్టి బ్రాహ్మణుఁడు నికే
తాళిందమునకుఁ జనియెం, గాలోరగ మపుడు బిలముఖము వెలువడుచున్.

21


క.

అలభూమిసురతనూభవు, తలిమంబునఁ బఱవ నూర్జితక్రోధసమా
కులమై నకులము చిలువన్, బలువాతన్ గఱచి ద్రుంచి పాఱగవైచెన్.

22


ఉ.

ఆసమయంబున న్మహిసురాగ్రణి పుత్రుఁ దలంచి గాఢసం
త్రాసము పేర్మి లోఁగిటికి గ్రమ్మర వచ్చుచు నుండఁ జూచి యు
ల్లాసరసం బెలర్ప నకులంబు ఫణిస్రవదప్రపంకసం
భాసితవక్త్రమై యెదురఁ బర్వి పదాబ్జములం బెనంగినన్.

23


చ.

ప్రకటభుజంగమక్షతజపంకవిలిప్తముఖంబు నమ్మహా
నకులముఁ జూచి భూమిసురుఁ డాహతభీతపరీతచిత్తుఁడై
యొకగడెసేపు రిమ్మగొని యుండి పదంపడి తేఱి నిష్పరీ
క్షకుఁ డసమీక్ష్యకారియును గావున రోషవశుండు గావునన్.

24


క.

తప్పదు చంపె న్వదనము, చెప్పక చెప్పెడును రక్తసిక్తంబయి నా
కుప్పుకలువోలెఁ గలిగిన, యిప్పాపని దీనికేన యిచ్చితి మెసవన్.

25


క.

సతిమాట మీర కస్మ, త్సుతుదగ్గఱఁ గాచియుండఁజూచిన నీదు
స్స్థితి వచ్చునె నాకుత్సిత, మతిగూల న్నకుల ముచితమా కావలికిన్.

26


క.

అని కన్నుల జేవుఱుగీ; ల్కొన లగుడం బెత్తి విసరికొట్టిన వెలికిన్
గనుగ్రుడ్లు వెడల నొప్పిం, బనివి యహో నకుల మపుడు ప్రాణము విడిచెన్.

27


చ.

నకులముఁ జంపి పోయి సదనంబున భూమిసురుండు గన్గొనం
జికిలిమడుంగుపానుపునఁ జెక్కుచెమర్పక యున్నపుత్రకున్
బ్రకటభుజంగభంగములఁ బ్రాంతమునం గని ఱిచ్చఁబోయి యే
టికి నిటుసేసితిం గలువరించి యయో నను రోయ నుత్తముల్.

28


వ.

అని యుదరతాడనంబుఁ జేసికొనుచు బ్రాహ్మణుం డుచ్చైస్వనంబున రోదనంబు
సేయఁదొడంగె నక్కలకలంబు చేరువఁ బుట్టినింట నునికింజేసి యాకర్ణించి యాజ్ఞసే
ని గృహంబునకు వచ్చి బ్రాణేశ్వరు నాలోకించి.

29


క.

కడిఖండ లైనపామె, క్కడిది కడుంబ్రేమఁ బెంపఁగా రాజిలుపెం
పుడునకుల మేల పొలిసెం, దడయక నీ వేటి కేడ్చెదవు చెపు మనఘా.

30