పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

నిరుపమశోభనాక్షతలు నించినపళ్ళెరము ల్ధరించి సు
స్వరమునఁ బూని యెన్నఁదగువర్ణములం బఠియింపుచుం ధరా
మరుల బహూకరింప గరిమంబున మూఁడవనాఁడు వర్తిలెం
బరమసుహృన్మనోజ్ఞ మయి ప్రాఁకెనయమ్మఱునాఁటివేకువన్.

369


మ.

నరలం గూర్చినకొప్పుతోఁ బసపుమిన్న ల్దేఱునెమ్మోముతో
గరిమ న్నాగమసానిప్రోలు దిరుగం గాఱంతులై తూర్యముల్
మొరయంగాఁ గడునొప్పె నాకబలియాలోశాటికాపేటికల్
సరసాప్తిం జదివించి రాప్తులగు రాజన్యు ల్గురు ల్మీఱఁగన్.

370


చ.

అతికృతులై నృపోపకృతులై హితులై తనరారుధారిణీ
పతు లతులప్రభం బురముఁ బాసి గృహంబుల కేఁగి రంత రు
డ్వ్రతిపరిపంథి రాజసమవర్తి సుకీర్తితనూజ కిచ్చె నూ
ర్జితగుణరత్నపేటికలఁ జేటికలం బదివేల వ్రేల్మిడిన్.

371


క.

ధాటీఘాటీఘటితవ, రాటీబోటీహృదార్తరవుఁ డజ్జగతీ
తాటంకవతీపతిపట, పేటీకోటీశతంబు బిడ్డకు నిచ్చెన్.

372


శా.

సౌరభ్యాహృతివిశ్వభూజనమనస్సంతాపము ల్విస్తృతాం
భోరుడ్రాగకరంకహృద్విహరణంబు ల్సారకర్పూరక
స్తూరీసాంకవగంధసారఘుసృణస్తోమంబుతో నిచ్చె సు
భ్రూరత్నంబున కేడువారములసొమ్ము ల్రాజు దేజంబునన్.

373


ఉ.

ఆహతగంధవాహముల నద్భుతహేషణదంభదూషణ
వ్యాహృతిభర్జితద్యుమణివాహములం గతిభిన్నమానస
వ్యూహములం గులీనమహిమోజ్జ్వలవాహములం గఠోరవీ
రాహితచిత్తభల్లుఁ డగునల్లుని కిచ్చె సుకీర్తికీర్తికిన్.

374


మ.

కటకస్థాతృమతంగజప్రభుమదౌత్కంఠ్యంబు వారించి యొ
క్కటన క్షోణిపుచేతఁ బ్రాభృతముగాఁ గైకొన్నవైంధ్యద్విప
చ్ఛటలం భిన్నదిశావశాప్రియలఁ జంచజ్జంగమగ్రావధీ
ఘటనస్ఫూర్తుల నిచ్చె నల్లునకు భూకాంతుం డుదాత్తస్పృహన్.

375


క.

అరదంబులఁ గుటిలాహిత, దరదంబులఁ గేతుపవనదళితప్రావృ
ట్ఛరదంబుల భరనతది, గ్ద్విరదంబుల నిచ్చె భూమివిభుఁ డల్లునికిన్.

376


వ.

వెండియుం బేరుగలవస్తువు లిచ్చి జామాత నాదరించి తాను నుపకృతుండై సుకీర్తి
యాఁడుబిడ్డ నాలోకించి యప్పు డశ్రుమిశ్రితాక్షుండై యిట్లనియె.

377