పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆహరిణాక్షికేలు పతిహస్తమునం బతికేలు తజ్జగ
న్మోహినికేల నుల్లసిల నూతనసాత్వికకంకణాంకుర
వ్యూహముతోడ రాజతనయోత్తమహస్తమునన్ మహావరా
రోహకరంబునం దిడె గురుండు సమంత్రకకంకణాంకముల్.

361


ఉ.

అంతటఁ జిత్రభాగ్యవనికాంతరితం బరితశ్చరద్ధరా
కాంతపటానకుంఠవృతకామినిఁ గన్గొనరామి వక్త్రసం
క్రాంతవిలాసలక్ష్మిఁ గనుకైవడి గడ్డముపట్టి యెత్తి ధీ
మంతుఁడు రాజనందనుఁడు మంగళసూత్రము గట్టె నింతికిన్.

362


చ.

అపుడు వధూకరోన్నమితయై తెలిముతైపుసేసఁబ్రా ల్ధరా
ధిపసుతునౌదల న్మదవతీమణి నించె విభుండు నమ్మద
ద్విపనిభయానమౌళిఁ బొదివెం దలఁబ్రా లవి జాతికెంపుల
బ్లపరిమితప్రియాప్రియకరాంబుజశోణిమ నొప్పె నెంతయున్.

363


చ.

సరిమెటుఁ బ్రాలపుట్టికలసందున బట్టినపట్టుపుట్టముం
దెరఁ దెరలింపఁజూచె సుదతిం బతి యవ్విభుఁ జూచె నింతి య
య్యిరువురజూపులం గలసి యేసెఁ బరస్పరమర్మలక్ష్యము
ల్శరముల నిల్చి నెన్నడుమ సారసబాణుఁడు సవ్యసాచియై.

364


క.

విడువనితగు లిరువుల కి,వ్వడువున ననుకరణి నుభయవస్త్రాంచలము
ల్విడిదేరునక్షతలతో, ముడిఁబెట్టిరి పంచశరుఁడు ముడిఁ బెట్టంగన్.

365


ఉ.

అంబరదంశితాఖిలసముగ్రమణిస్ఫుటవేదికాంతరౌ
దుంబరపీఠి నుండిరి వరధూవరు లయ్యెలనాఁగ యగ్నిహో
త్రంబున వేల్చె లాజలు ధరావరసూనుఁడు సంభృతానురా
గంబున నేమి చెప్పఁ దనకౌఁగిటి కింతిమొగంబు వ్రేల్వఁగాన్.

366


క.

ఆగామిప్రణయరణో, ద్యోగం బణఁచుటకు నేఁడ దొరకనె నితఁడం
చాగురుకుచనగ నయరే, ఖాగురుఁ డడుగూఁది సన్నెకలు మెట్టించెన్.

367


సీ.

అవలోక మొనరించి రసురఘస్మరపదధ్యానసంపాదినౌత్తానపాది
నేడ్వురుఋషులతో నీక్షించి రురుకుచశ్రీజితాహార్య వసిష్ఠభార్య
గళితచేలాంచలగ్రంధులై మ్రొక్కిరి యిలువేలుపులకు బెద్దలకు భక్తి
నుర్వీసుధాశనాశీర్వాదపూతాక్షతములు మస్తకములఁ దాల్చుకొనిరి


తే.

రాజకన్యక యంతఃపురమున నుండె, బెండ్లిచవికెకు నేతెంచెఁ బెండ్లికొడుకు
విప్రులకు బంధుజనులకు విద్యవారి, కుభయనరనాథు లీప్సితం బొసఁగి రంత.

368