పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గనలు వహించి యిట్టికొఱగానిప్రయోజన మాచరింప నీ
యనుపమదివ్యదృష్టి కొకఁ డడ్డమె చూడుము నేర్పునేరముల్.

290


క.

అని యేను మేను వడఁక, న్వనితాజనతార్తిఁ బొగల వారించి ప్రబో
ధనిరీక్షణముల సర్వముఁ, గనుఁగొని యితఁ డనపరాధిగా యని శాంతిన్.

291


వ.

ముద్గలుండు న న్నాలోకించి యిట్లనియె.

292


చ.

కెలసముఁ బూని పెండ్లిపనికిం బ్రతికూలుఁడ వైతి విట్లు మొ
క్కల మిది గాదె నీమన సకల్మష మౌనటులైనఁ గేరడం
బుల కిది చోటె మోఘమయిపోవదు నావచనంబు గన్నచా
యల నిఁక బ్రహ్మరాక్షసుఁడవై యిల నీవు చరింపుచుండఁగన్.

293


ఉ.

అల్లినవరతమూలఘటకాంకుఁడు భూమినిలింపకన్యకా
హల్లకభల్లభగ్నహృదయస్థలుఁడై తను వుజ్జగించి మ
త్సిల్లున కుద్భవించుజయసేనుఁడు నా నలవిప్రకన్య యు
త్ఫుల్లసరోజనేత్ర ప్రియపుత్రికయై పొడము న్సుకీర్తికిన్.

294


ఉ.

ఆయెలనాగ దైవగతి నర్ధనిశం గతిదప్పి నీతరు
చ్ఛాయకు వచ్చు నాసరసిజచ్ఛదనేత్రకు నవ్వసుంధరా
నాయకసూతికిం దగులొనర్పుము సంశయ మేది యంతలో
బాయు మహీసురాసురత బ్రహ్మపదంబు భజింతు పిమ్మటన్.

295


మ.

అని శాపావధిఁ జెప్పి ముద్గలుఁడు పోవం బోవ నాలోన నె
ఱ్ఱనిగ్రుడ్లుం గులిశంబులం దెగడుకోఱ ల్బాడబస్ఫూర్జితా
ననముం జుంజురువెండ్రుక ల్భయదకర్ణద్వంద్వముం గల్గి మే
దినికి న్వ్రేగుగ బ్రహ్మరాక్షసుఁడ నైతిం జంచరీకాలకా.

296


వ.

అ ట్లుర్వీపూర్వగీర్వాణుఁడనై సకలప్రాణిభక్షణంబునఁ గౌక్షింభర్యంబు ప్రవర్తిల్ల
నివ్వటపి నాశ్రయించి యుండితి నిప్పటికి ముప్పదిసంవత్సరంబులు గడచె నమ్ముద్గ
లుండు చెప్పినట్లు నామరంది జయసేనుండై పుట్టె నవ్విప్రకన్యకవు నీవు ని న్నన్నర
నాథకుమారునకుం బరిణయంబు సేసి యాసురం బగు నివ్వేషం బపనయించెద
ననుటయు నలరుమొగంబున రాజన్యకన్య భూసురాసురున కిట్లనియె.

297


క.

ఇచ్చోట నానిమిత్తము, చచ్చిన యవ్విప్రు సుప్రసన్నత్వము నేఁ
డచ్చుపడ మనిచి పురికిం, బుచ్చి జగద్వినుతకీర్తిఁ బొగడొందఁగదే.

298


క.

భూసురహత్యాఘమహా, త్రాసమునకు వెఱతునని పదంబులఁ బడి గా
ఢాసక్తిం ప్రార్థించిన, నాసురకులశాత్రవుఁడు దయాభిముఖుండై.

299