పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఇవి చెందిరికచీరలవుఁ గదా తిగిచి కుచ్చెలఁ బోసి కటులఁ గీల్కొలుపవచ్చు
నివి కుంకుమరసంబులవుఁ గదా గబ్బిగుబ్బల జొకటంబుగా నలఁదవచ్చు
నివి చెంగలువసెజ్జలవుఁ గదా కౌఁగిళ్లఁ బ్రియులుండ మెఱసి నిద్రింపవచ్చు
నివి చిగిర్చినమావులవు గదా కటికివేసవులనీడలఁ క్రీడ సలుపవచ్చు


తే.

నివి సరోజాతరాగంబులవు గదా బె, డంగడరుపేటికలఁ బెట్టి డాపవచ్చు
ననుచు వరుణాఐరోధకామినులు పలుక, నస్తగిరిఁ బ్రాఁకె జరఠారుణాతపములు.

224


మ.

తనచిత్తంబునఁ బద్మినిం బవలుపొంద న్వారుణీకేళికిం
జనఁ బైకొన్నప్రదోషపీడకు సహించ న్నేర్చె నింకెట్లుగా
దనువో మంగలవాఁడనందు భృగుపాతప్రీతి నేతెంచెనో
యన సేవించె సరోజబాంధవుఁడు ప్రత్యగ్భూమిభృత్కూటమున్.

225


తే.

అపరపర్వతశిఖరసింహాసనమున, గొంతదడవుండె గ్రహరాజు గ్రుంకుటుడిగి
సమయరమ మజ్జనంబాడి సాగరంబు, దండనుంచిన కుంకుమపిండ మనఁగ.

226


చ.

కరటనిషక్తఖర్జు వడఁగం జిరగర్వసమగ్రమంజన
ద్విరదము పాయుతన్మదసృతిం బొడుకెక్కినయస్తసానువం
దరదముఁ జారఁ బైనడుగు లానక యుర్వికి డిగ్గు నుద్ధత
త్వర ననఁ గ్రుంకె భానుఁ డవధాననికుంచితభానుహస్తుఁడై.

227


సీ.

పరిపక్వబింబవిభ్రాంతి దవ్వుల రాజకీరడింభములు గ్రుక్కిళ్ళు మ్రింగఁ
బ్రత్యగ్రశోణితభ్రమ నుపస్థితములై పంచాననంబుల బయలునాక
సల్లకీపల్లవచ్ఛదనశంక సగంధకరులు రిత్తకురిత్తకరము సాఁపఁ
బుంజీకృతక్రవ్యబుద్ధి నిర్ఝరవృద్ధశార్దూలములు నోళ్ళు చప్పరింప


తే.

గైరికద్రవవిచికిత్స గాన నాట, పాటలోష్ఠులు పాలిండ్లఁ బ్రామఁ దివురఁ
బ్రత్యగవనీధరంబునఁ బ్రాకుదెంచె, నపుడు దివసావసానసంధ్యామరీచి.

228


తే.

చరమదశఁ గన్న వాసరస్వామిఁ దలఁచి, తమ్ము లామోద మఱివంతఁ దలఁకుచుండ
నస్తముపగోత్ర మయ్యు రాగాప్తిఁ బొదలె, మొదలఁ బాశ్చాత్యకృత్య మట్టిదయ కాదె.

229


తే.

సద్ద్విజశ్రేణి దివసావసానవేళ, చలువఁదేరు వనప్రదేశములఁ జేరి
కన్ను లరమోడ్చి విసృష్టగతులు మీఱ, నారవవ్యాజమున జపం బాచరించె.

230


సీ.

తావులకొండనెత్తము డిగ్గి చెంగల్వదొనల చల్లనినీటఁ దొప్పదోఁగి
పరిగొన్నపచ్చకప్రపుదుమారము రేచి తరుణపల్లవపరంపరఁ దెరల్చి
వికసితప్రసవజాలకరేణువులవంటి గంధసంపద దేటిగములఁ బ్రోచి
బలిమి గాననపరంపరల నుఱ్ఱజటలూచి తీవపందిళ్ళలోఁ దిరిగి తిరిగి


తే.

యెండపొడ దూరక పగళ్లు నిర్లు గవయు, తియ్యమావుల క్రేనీడఁ దెరువుసాగ