పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఇట్టివట్టిసుద్దు లేటికి నీయంగ, సంగలాభ మైన జాలుఁ దెఱవ
వెఱవ మెఱసి మీఁదఁ బఱతెంచు నత్యు గ్ర, పాపమునకు నరకకూపమునకు.

213


చ.

కడపక నీవు నాపలుకుఁ గాదని వేదనిసర్గమార్గమం
దడిగెదవేని మేనియడియాసఁ దొఱంగి లతాంగి ప్రాణముల్
విడిచెద నీవు చూడ నలవేవడిఁ బాపములోన దీనిలో
విడిదలగాక వేకలఁచి వేచెడి దెయ్యది చూచికొ మ్మనన్.

214


శా.

ఆఘోరోక్తులు వీనులం బడిన నాహా పుట్టిరాపట్టి ని
ర్మోఘం బీయనమాట తుచ్ఛదురితంబు ల్ధర్మకర్మక్రియా
శ్లాఘ న్మాన్చుకొనంగవచ్చుఁ దుదిఁ దెళ్ళంబోనియాబ్రహ్మహ
త్యాఘం బేమిటఁ బాయు నా కొకయుపాయం బెద్ది యీచేఁతకున్.

215


క.

కులగోత్రశీలములకు, న్వెలియైనం దగు మహోగ్రవిప్రప్రాణా
నిలవిచ్యుతి కే నొప్పం, గలదాననె యింతకంటెఁ గలుషము గలదే.

216


క.

అనుచితకార్యము లేమే, నొనరించినయత్న మొప్ప నుత్తమజను లా
ర్తుని విప్రుని విధ్వస్తా, త్ముని నెప్పుడు సంతరింపుదురు మేలగుటన్.

217


ఉ.

కావున నొండుపాయములు గావు మహీసురరక్షణంబ మే
లై విలసిల్లు నేమి తెఱఁగైనను మంచిదె యంచు బుద్ధిలో
భావనఁ జేసి యచ్చెలువ పల్కె ధరాసుర రెండుజాలలో
నీవది కేగుదెంతు సరణిం జలియింపకయుండు మిత్తఱిన్.

218


వ.

అని యతండు విశ్వసించినట్టుగా నందులకుఁ గొన్నిశపథంబులం బలికి యక్కలికి
నగరి కరుగుచు నకురాహగతుం డగుగగనమణి నాలోకించి కీర్తించి కరంబు లురో
జాగ్రంబులఁ గీలించి యిట్లనియె.

219


క.

ఓలోకమిత్ర యోకరు, ణాలయ నీకులముదాన నవనీసుర దు
శ్శీలంబు మాన్చి యిట నా, యీలువు చెడకుండఁ బ్రోవవే నేఁ డనుచున్.

220


క.

చేరఁ జనుదెంచి యలసర, సీరుహహితుఁ డబల యట్ల చేయుదు చింతా
భావంబుఁ ద్రోఁచి కదలు మ, గారమునకు ననుచుఁ బఱచె గగనంబునకున్.

221


వ.

ఆసమయంబున.

222


చ.

ఇనుఁడు వసూద్ధతుం డరయ నెవ్వఁడు వానికి నీతి లేదు వీఁ
డినుఁడు వసూద్ధతుండు నయమెయ్యది తద్బిసినీదివారతిం
దనిసి ప్రదోషకాలమునఁ దానిదె వారుణి నానియున్నవాఁ
డని యలుకంబలె న్మరలె నా నడచెం దగ ఛాయ ప్రాచికిన్.

223