పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

న న్నితఁ డంతరంగమున నమ్మి యయో చనుదెంచుచున్నవాఁ
డెన్నిభవంబులం దొలఁగు నిష్టులఁ జంపిన ఘోరపాప మెం
దు న్ననువంటిదుష్టచరితుం బరికింపదు లోక మాక్రియల్
గన్నవిగావు విన్నయవిగా వొనరింపఁగఁ బాసె సఖ్యముల్.

65


క.

నడవడి పురుషుని భారం, బిడి భూరివృషంబు ఱాత హేమము నొఱయం
బడు శుద్ధిశక్తిరుచులకుఁ, బడఁతులహృదయంబు లొరయఁ బడ వేగతులన్.

66


క.

పరమద్రోహపురస్సరంబులు నయోపాయక్రియాదూరము
ల్దురితిచ్ఛన్నము లన్యతాపకరణోద్యోగంబు లప్రత్యయా
కరము ల్సత్యపరాఙ్ముఖంబులు సమగ్రక్షాంతినల్లీశిత
క్షురము ల్దంభమయంబు లెట్లెఱుఁగవచ్చుం గామినీచిత్తముల్.

67


క.

ఈమనసులు గలిగిన మహి, ళామాయామయతరోక్తులకు లోనై య
య్యో మదినమ్మిన కీశ, గ్రామణిఁ దెగటార్పవలసెఁగా నా కనుచున్.

68


క.

అలక్రకచుఁ డల్లనల్లనఁ, బలుకఁగ విని వానరాధిపతి భూరిభయా
కులమానసుఁడై యపు డో, దళితాఘా యేమి పలికెదవు నీ వనుడున్.

69


క.

ధృతిఁ గ్రకచుఁ డపుడ దత్త, ప్రతివచనుం డగుచు నుఱకపఱచుచునుండన్
వితతప్రజ్ఞం గపి యు, ద్ధతు వానిం గ్రమ్మఱించెదం గా కనుచున్.

70


క.

భీతి ప్రవాహ మతిధృతి, సేతువుచే నాఁగి పలికె చెలికాఁడా నీ
శాతోదరి నాసోదరి, కౌతుకమున నున్నె భవదగారం బమరన్.

71


క.

ఇది వినవలతుం జెపుమా, మది వొదలఁగ ననిన శింశుమారుఁడు పలికెన్
గదబాధిక యయియున్నది, గద నీయనుజాత యెట్లుగా ధరియింతున్.

72


సీ.

భార్యలేక యొనర్చుపండుపు దండువు కులకాంత పెట్టనికూడు గీడు
పత్నితోఁ బలుకనిపలుకులు చిలుకులు గృహిణిలేని కబంధకేళి జాలి
జాయ వాటింపనిసరసము ల్విరసము ల్ప్రాణేశ్వరికిఁ గానిపాటు చేటు
దయితకై చేయనిప్రియములు భయములు వల్లభ వెలియైనయిల్లు పొల్లు


తే.

ముద్దుకులకాంతసుద్దు లేప్రొద్దు వినని, చెవులు గవులు వృథా వేయుఁ జెప్ప నేల
యకట సతి లేనిబ్రతు కేల యర్థ మేల, వాహనము లేల కరు లేల వసుధ యేల.

73


క.

నావిని బహుమానుఁడు బా, ష్పావృతముఖుఁ డగుచు వాని కనుఁ గ్రకచా నీ
దేవి రుజ మాన్పుటకు లే, రే వెజ్జులు మందుఁ జెప్పరే వా రనినన్.

74


క.

చెప్పిరి వానరహృదయం, బప్పనికి నవశ్య మనుచు నగదంకారు
ల్తప్ప కది హేతువుగ ని, న్నిప్పుడు గొనిచనుట యని యహితుఁ డతఁ డాడెన్.

75