పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రబంధంబుఁ జేయం బ్రారంభించి యేతత్కావ్యకన్యకారత్నంబున కనుకూలవల్ల
భుం డేదేవుండొకో యని విచారించి శయ్యాతలంబున శయనించిన.

20


శ్లో.

హృన్నిత్యయాచర మయా ప్యుమయాప్రభుత్వం
మౌళీతుషార ఘృణినా జగతాం గురుత్వం
సందీయ న్నభసి కోపి మహాన్సుమాస్మే
స్వప్నే శుభే సితసితద్యుతి రావిరాసీత్.

21


క.

కలలో నలుపుం దెలుపుం, గలవేలుపుదొర యగణ్యకారుణ్యరసం
బొలయ ననుఁ జూచి ద్రాక్షా, మధురప్రణయపూర్వభాషలఁ బలికెన్.

22


క.

నను హరిహరనాథునిఁగా, మనమునఁ దలపోయు నృపకుమారక విద్వ
జ్జనసేవ్యము నీకావ్యముఁ, దన కి మ్మభిమతవరప్రదాతకు భక్తిన్.

23


వ.

అని యానతిచ్చి యావేల్పు విచ్చేసిన నానందకందళితపులకదంశితుండనై మేలుకని.

24


క.

ఏచనువు గలదు హరిహర, సాచివ్యము నొంద నన్యజనులకు మది నా
లోచింపఁ దిక్కయజ్వకు, నాచనసోమునకు మఱియు నాకుం దక్కన్.

25


ఉ.

సన్నుతశబ్దలక్షణరసస్ఫురితంబుఁ బురాణభారతో
త్పన్నము నైన సాధుపఠితం బయి యొప్పదు మర్త్యసేవ్యమై
యున్న ప్రబంధ మెప్పటి కహో జగదేకపవిత్రభూమిదే
వాన్నము సారమేయచరణాంకితమైన భుజక్రియార్హమే.

26


గీ.

అతికుటుంబరక్షణాపేక్షఁ బ్రాల్మాలి, కృతులు మూఢభూమిపతుల కిచ్చి
చచ్చి నిరయమునకుఁ జనుకంటె హరిహరా, ర్పణముఁ జేసి సుగతిఁ బడయరాదె.

27


ఉ.

అంగధృతాబ్జు నిశ్చలతరాతను సర్వదు సర్వమంగళా
లింగితు భీషణాశరకులీనజయోన్ముఖపౌరుషక్రియా
సంగతు భీషణాంబకకృశాను నిరూపితవైరిసద్ము యో
గాంగయుతాదృతిన్ హరిహరాకృతి మత్కృతిభర్తఁ జేసేదన్.

28


వ.

అని నిశ్చయించి యాత్రిలోకీకర్త మత్కృతిభర్తఁగా నొనర్చితి మదీయవంశా
వతారం బభివర్ణించెద.

29


ఉ.

ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుఁడు బైచనృపాలుఁ డద్ధరి
త్రీరమణీమనోహరుని తీవ్రయశస్స్రుతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్.

30