పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టువంటి పను లెందుకు. భగవంతు డిచ్చినమట్టుకు భక్షించి సుఖముగా నుండుదము. ఇటువంటిపనులకు పోతే మన కేమి మోసము వచ్చునో తెలియదు. అధికప్రసంగములకు బోయినవాడు మేకును పెరికినకోతివలె నిజముగా హాని బొందును. అదెట్లనిన

దమనకునకు కరటకుడు చెప్పెడు కోతికథ

ఒకపట్టణమునకు సమీపముగా నొకగొప్పదేవాలయము జీర్ణమై సగము నేలంబడియుండగా దేవభక్తిగల వొకవైశ్యుడు దాని మునుపటివలెనే చక్కసేయుండని శిల్పకారులకు కొంతధన మిచ్చెను. వారు ఆధనము తీసుకొని ఆగుడి కట్టుచుండేసమయములో నొకచేవదూలము పలకలుగా గోయుచు అది చీలుటకై అక్కడక్కడ మేకులు దిగగొట్టి యింతలో ప్రొద్దుగూకినందున తమయిండ్లకు పోయిరి. అప్పుడు సమీపవృక్షముల నాశ్రయించి దిరుగుచున్న కోతులు దేవాలయముదగ్గిర దిరికివచ్చి యెక్కి చెట్లపైకి కుప్పించి దూకుచు చెట్లపైనుండి దాటుచు గొప్పకొమ్మల నూగులాడుచు ప్రాకారములు పాకి పరుగులెత్తుచు గోపురంబులమీద కూర్చుండుచు గోళ్లతో పక్కలు వీపులు గోకుకొనుచునిక్కుచు కనుబొమలెత్తి వెక్కి రించుచు పండ్లిగిలించుచు ఒకదానితో నొకటి జగడమాడ ఓడిపోవుచు పండ్లు భక్షింపుచు తేనెలు దావుచు స్వాభావికమైన చపలత్వముచేత తిరుగుచుండెను. అందులో నొకముసలికోతి దైవవశముచేత మేకులు గొట్టియున్న చేవదూలము దగ్గరికి వచ్చి వృషణంబులు నెరియలో వ్రేలాడవేసుకొని దానిమేకు రెండుచేతుల బట్టి బలవంతముగా నూడబెరికెను. అంతట వృషణంబులు నెరియలో నిరుకుకొని నలిగినందున మొరలు పెట్టుచు నావేదనచేత మృతిబొందెను. కాబట్టి యీప్రకారముగా తనకు నిమిత్తము లేనిపనికి జొచ్చినవారి కిప్పుడే చెప్పినకోతివలె అవును. మనకు అది విచారించవలసిన పని యేమి. మనదొర భక్షింపగా మిగిలినమాంసము భక్షింతము రమ్మనిన దమనకుం డిట్లనియె.

మిత్రులకు నుపకారంబును శత్రులకు నపకారంబును జేయుటకై లోకములోవారు రాజులను గొల్తురు గాని తమకడుపు పోషించుకొనుటకు గాదు. అందుకై గొల్చుటకంటెను చచ్చుట మేలు. అటువంటివాడు చచ్చినా భూమికి వెలితి యవునా. ఒకనివల్ల ననేకులు జీవించడము లేకుంటేలవానిజన్మ మెందుకు. ము