పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న నొకయరణ్యములో ఒడ్డుమెరకనేలను మోకాళ్లు విరగబడిన సంజీవకుని జూచి వర్తకుడు కొంతసేపు చింతించి తర్వాత ఆబండిమీదిసరుకులన్నియు మనుష్యులచేత యెత్తించుకొని పడియున్న సంజీవకుని కాళ్లకు కట్లు గట్టించి, ఆయెద్దుమీది ప్రీతిచేత కొందరిని అక్కడ కావలియుంచి అవతల సాగిపోయెను.

తర్వాత అక్కడ కావలియుండినవారు మనము ఈభయంకరమైనఅరణ్యములో నుండి చావవలసిన దేమి పోదామని అతిత్వరితముగా బోయి ప్రభువును జూచి స్వామీ మేము ఆవనమునందు వృషభమునకు కావలియుండగా యెక్కడిదో వొకపులి వచ్చి సంజీవకుఁ జంపి యీడ్చుకొనిపోయెను. మేము తప్పించుకొని మీసన్నిధానమునకు వచ్చితిమి. మీతో యీమాట చెప్పుటకు సిగ్గవుచున్నది. అని మహాభయభక్తులతో జెప్పిరి.

అక్కడ ఆసంజీవకుండు ఆయస్సు కలిగియుండుటచేత విరిగినకాళ్లు నానాటికి చక్కటిగా వచ్చినందున మెల్లమెల్లగా లేచి తిరుగుతాడుచు లేతపచ్చిక మేయుచు తియ్యనినీళ్లు తాగుచు ఒళ్లెరుగనిసత్తువ బట్టి కొంచమైనా భయము లేక ఒకనాడు పెద్దరంకె వేసెను. ఆవనములో పింగళకుండను నొకసింహము పులులు అడవిపందులు యెలుగుగొడ్లు అడవిదున్నలు యేనుగులు ఖడ్గమృగములు దుప్పులు లేళ్లు మొదలైన సకలమృగములను శిక్షింపుచు రక్షి౦పుచు యెదురులేని భుజబలముచేత గర్వించి స్వేచ్ఛగా దిరుగుచు తనపరాక్రమముచేత సంపాదింపబడ్డ రాజ్య మనుభవింపుచుండెను. ఆసింహము నాడు దప్పిచేత డస్సి నీళ్లు దాగుటకై యమునానదిరేవులో దిగుచుండి మహాభయంకరమై ప్రళయకాలమేఘమువల్ల బుట్టినయురుముతో సమానమైనసంజీవకునిరంకె విని మిక్కిలి దిగులుపడి యిది యేమి యిక్కడ యెవ రున్నారు అని తనలో తాను ఆలోచన చేయుచు అవతల సాగిపోక నిలిచెను. అప్పుడు పింగళకునిమంత్రికుమారులైన కరటకదమనకు లనేపేరుగలనక్కలలో దమనకుడు తమప్రభువైన పింగళకుడనేసింహరాజు వృషభముయొక్కరంకె విని జడిశినతెరం గెరింగి కరటకునిం జూచి చూచితివా కరటకుడా ఇంతగొప్పవాడైన మనరాజు వింతయైనశబ్దము విని నదికి నీరు ద్రావబో వెరచెను. మనము అతనిమంత్రికుమారులమై యుండి యుపేక్షించుట యుచితము గాదు. అతనిదగ్గిరికి పోయి వెరచుటకు కారణ మేమని విచారించి అతనిజడుపు దీర్చుదమనిన కరటకుం డిట్లనియె.

ఓవెఱ్ఱివాడా దోవనుపొయ్యేవ్యాజ్యము కొనితెచ్చుకొన్నట్టు మనకి