పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రభేదతంత్రము

ఒకవనములో నొకసింహమున్నువృషభమున్ను చాలాస్నేహము గలిగియుండగా మిక్కిలితంత్రముగల ఒకనక్క కొండెములు చెప్పి ఆరెంటికి విరోధములు పుట్టించి సింహముచేత వృషభమును చంపించెను.

అని చెప్పగా రాచకొమాళ్లు విని మొదట సింహమునకున్ను వృషభమునకున్ను స్నేహ మెట్లా కలిగెను. తర్వాత ఆస్నేహము చెడి విరోధ మెట్లా వచ్చెను. యిది మాకు సవిస్తరముగా జెప్పవలయు ననిన విష్ణుశర్మ యిట్లనియె.

దక్షిణదేశమునందు బహుమందిధనికులుగల మహిళాపుర మనుపట్టణము గలదు. అందు బహుసంపత్తు గలిగిన వర్ధమానుండను పేరుగల ఒకవర్తకుడు గలడు.అతడు నిండా ధనము గలవాడైనా తనధనమును వృద్ధిబొందించవలెనని తలంపు గలిగి యిట్లని యోచించెను. ధనము లేకుంటే ఆర్జింపవలయును. ఆర్జి౦చినధనమును రక్షించవలయును. రక్షించినధనమును వృద్ధి బొందింపవలయును. వృద్ధి బొందించినధనమును సద్వినియోగము సేయివలయును. ఇట్లు సేయనేరనివానియింట ద్రవ్య మెట్లు నిలుచును. మూర్ఖులయినవారు ఈయర్థమును తెలియనేరరు. సంరక్షణ సేయని ద్రవ్యము అప్పుడే నశించును. వృద్ధి బొందించనిధనము కొంచెముగా వ్యయము చేసినా కాటుకవలె సమసిపోవును. అనుభవమునకు రానిసొమ్ము కలిగియు లేనిదానివలె సుఖకరము గాదు. ఒకరి కివ్వడము, తా ననుభవించడము ఎవరైనా యెత్తుకోనిపోవడము ఈమూడున్ను ధనము పొయ్యేటందుకు దోవలు. కాబట్టి యెవడు తనధనమును ఒకరి కివ్వక తానున్ను అనుభవించడో వానిధనమును యెవరైనా యెత్తుకొనిపోదురు. నిండినచెరువులకు అలుగులు తీశినట్లు సంపాదించినధనమును పాత్ర మెరిగి వ్యయము చేయుట రక్షించడమేను.

అని వర్ధమానుడు చాలాయోచన చేసి తనయింటనున్న కుంకుమపువ్వు గోరోజనము కస్తూరి ముత్యములు బవడములు రవలు కెంపులు పచ్చలు వైఢూర్యములు గోమేధికములు పుష్యరాగములు అపరంజి వెండి పట్టుచీరలు సరిగెదుప్పట్లు నానావిధములైనశాలువలు మొదలగు వెలపొడుగువస్తువుల నొకబండిమీద యెక్కించి ఆబండికి సంజీవకనందకము లనేపేరుగల రెండెద్దుల గట్టించి బండి సాగించుకొని కావలసిన పరివారముతో కూడా వర్తకము చేయుటకై పరదేశమునకు బైలువెళ్లెను. అప్పుడు బండినిండా బరువైనందున మార్గమధ్య