పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచివంశములో దుర్మార్గుడు పుట్టి కులము చెరుచును. యావనము ధనము దొరతనము అవివేకము అను యీనాలుగింటిలో ఒకటొకటే అనర్ధమును పుట్టించును. ఈనాలుగున్ను కలిగినచోట చెప్పవలసినదేమి. కాబట్టి వివేకము లేనందున దుర్మార్గులైన నాకొడుకులకు నీతిశాస్త్రము చదివించి వివేకము కలుగజేసుటవలన వారిని పునర్జన్మసంభూతులుగా నేర్పరచగలపుణ్యాత్ము లెవరైనా యీసభయందు గలరా.

అని రాజు చెప్పగానే దేవగురువైనబృహస్పతివలె సమస్తనీతిశాస్త్రములు తెలిసిన విష్ణుశర్మయను బ్రాహ్మణుడు లేచి రాజుని జూచి ఓమహారాజా మీ రీలాగున చింత చేయవలసినది యేమి. మీరు తలచినపని చక్కచేయుట యెంతమాత్రము. నేను విూకొడుకులనందరిని ఆరునెలలలో సకలనీతిశాస్త్రము తెలిసినవారినిగా జేసి మీకు సమర్పించకపోతే ధనధాన్యములతో నాయిల్లు విడిచిపెట్టి మీరాజ్యమునకు దూరముగా బోగలవాడనని ప్రతిజ్ఞ చేసెను.

అందుకు రాజు చాలా సంతోషించి ఆవిష్ణుశర్మకు యేనుగులు గుఱ్ఱములు తేరులు పల్లకీలు గొప్పవెలగలిగినవస్త్రములు సొమ్ములు మొదలుగాగలవస్తువులు బహుప్రీతితో బహుమానము చేసి తనకొడుకులను పిలిపించి అయ్యా ఇదుగో వీండ్లు మీకొమాళ్లు గాని నాకొమాళ్లు గారు మీరు వీండ్లను చదివించి బుద్ధిమంతులను చేసేభారము మీది అని వారిని విష్ణుశర్మవశము చేసెను.

అంతట విష్ణుశర్మ రాజపుత్రులను పిలుచుకొని పోయి తనమనస్సులో ఆలోచన చేసి మిత్రభేదము, సుహృల్లాభము, సంధివిగ్రహము, లబ్దనాశము, అసంప్రేక్ష్యకారిత్వము అని అయిదుతంత్రములు గల పంచతంత్ర మనేగ్రంథము చేసి వారితో నిట్లనియె.

మిత్రభేద మనగా స్నేహితులకు విరోధము పుట్టించడము. సుహ్మల్లాభ మనగా స్నేహితులను సంపాదించుకోవడము. సంధివిగ్రహ మనగా ముందుగా స్నేహము చేసి తర్వాత నిరోధించడము. లబ్ధనాశన మనగా దొరికినధనమును పోగొట్టుకోవడము. అసంప్రేక్ష్యకారిత్వ మనగా ఏకార్యమునైనా చక్కగా విచారించక చేయడము.

పంచతంత్ర మనగా ఈఅయిదుతంత్రములు గల గ్రంథము.