పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

పంచతంత్రము

పాటలీపురమను ప్రసిద్ధంబైన యొక పట్టణముగలదు . అది వేదశాస్త్రపురాణాది చతుర్దశవిద్యలు నేర్చిన బ్రాహ్మణోత్తములచేతనున్ను మిక్కిలిబలపరాక్రమశాలులయిన రాజశ్రేష్ఠులచేతనున్ను క్రయవిక్రయములయందు బ్రసిద్ధులైన వైశ్యులచేతనున్ను దేవబ్రాహ్మణవిశ్వాసము గలిగియుండెడు శూద్రులచేతనున్ను నానావిధములయిన ఆయుధవిద్యల నభ్యసించుటయందు నేర్పు గల వీరభటులచేతనున్ను అనేకదేవాలయములచేతనున్ను ప్రకాశింపుచుండును.

ఆపట్టణము సుదర్శనుండను రాజు యేలుచుండును. అతడు పరాక్రమమున కుమారామస్వామితోనున్ను బుద్ధియందు బృహస్పతితోనున్ను ధైర్యంబున హిమవంతునితోనున్ను దాతృత్వమునందు శిబికర్ణదధీచులతోనున్ను సమానుడై యిజ్జగంబున బ్రసిద్ధి కెక్కి యుండెను.

ఆరాజశ్రేష్ఠు డొక్కనాడు మంత్రులు పురోహితులు విద్వజ్జనంబులు సామంతరాజులు బంధువులు మిత్రులును పరివేష్టించియుండగా సభలో నిండుకొలువుండి దుర్మార్గులై నీతిశాస్త్రము తెలియని తన కొడుకులం జూచి మిక్కిలి చింతాక్రాంతుండై సభలోనున్నవారితో నిట్లనియె.

విద్వాంసుడున్ను ధార్మికుడున్ను కానికొడుకు పుట్టితే ఫల మేమి చూడిపాడి లేనిగోవును పెట్టుకొని యేమి చేయవచ్చును. బహుమంది కొడుకులు గలరని లెక్కపెట్టుకొనుటచేత కొంచమైనా ప్రయోజనము కద్దా. వంశమునకు కీర్తి తెచ్చినకుమారుడు ఒక్కడే చాలును రూపమున్ను ధనమున్ను బలమున్ను కలిగినా శాస్త్రజ్ఞానము లేని కొడు కెందుకు. అటువంటికొడుకును గనుటకంటే తల్లి గొడ్రాలైనా మేలు. కడుపు దిగబడినా మంచిదే. పుట్టినవాడు చచ్చినా బాగు. ఆడదిగా బుట్టినా వాసి. పూర్వజన్మములయందు తండ్రి చేసినపుణ్యకర్మముచేత ఉదారుండును ధర్మాత్ముండును తల్లిదండ్రులమాట జవదాటనివాడును మంచినడతగలవాడును సర్వజనహితుండును విద్వాంసుండును సమర్థుండును ఒకరు తనకు చేసినమేలు మరవనివాడును ఆడితప్పనివాడు నైనపుత్రుండు గలుగు నుపాసకర్మముచేత పాలసముద్రములో విషము పుట్టినట్లు