పుట:నృసింహపురాణము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

99


సీ.

అసురాంగనాకుంకుమాంగరాగంబున నరుణోదయచ్ఛాయ నమరునెడలు
మునివరనియమనియుక్తకుణాశాక్షతములఁ చెట్టువలు గట్టి పొలుచునెడలు
శబరికాశ్రవణప్రశస్తబర్హిచ్ఛదచిత్రీతోర్ముల విలసిల్లునెడలు
మదకలకాంతారమాతంగమదజలోద్వేలాంబువుల నిగ్గుదేరునెడలు


తే.

నగుచుఁ బ్రతిదివసంబును నతినవంపు, టొప్పిదంబులు దనుఁ జెందె నుల్లసిల్లు
సకలకళ్యాణకాలీలసత్ప్రవాహ, భవ్య యీభవనాశినీపరమతటిని.

154


ఉ.

ఈవనధిప్రసూతయును నేనును నింపెసలార వేడ్కమై
నీవనమధ్యభాగమున నెప్డు చరింతుము దానఁజేసి ల
క్ష్మీవననామ మివ్వనము శ్రీరమణీయము లోకపావనం
బావనజాప్తచంద్రవసుధాంబరసుస్థిర మిజ్జగింబులన్.

155


క.

తనుఁ దలఁచినఁ దనుఁ జూచినఁ, దనుఁ జెందినఁ దను సమంచితస్తోత్రములన్
గొనియాడిన లక్ష్మీవన, మనుపమసకలార్థసార మగు జనములకున్.

156


సీ.

భవభానుతీవ్రతాపంబునఁ బడనీదు తనతరుశాఖలతమపునీడ
దుఃఖవాసనములఁ దొలఁగించుఁ దనలతావరపుష్పశోభితవాసనముల
దనతనుగాలిసోఁకునఁ జాలఁ జిగురొత్తుఁ జతురమనోజ్ఞవిజ్ఞానలతలు
వనవిహంగమములయనుఁగుటెలుంగు లాహ్వానంబు సేయుఁ గైవల్యభగము


గే.

ననినఁ బొగడ నలవి యగునె యహోబల, భూషణంబు సుకృతపోషణంబు
సాత్త్వికప్రియంబు సర్వాశ్రయంబు ల, క్ష్మీవనంబు భువనపావనంబు.

157


ఉ.

ఈవిపినంపుఁ గమ్మవిరు లిందిరగ్రొమ్ముడి కీపరాగముల్
శ్రీవదనాబ్జవాసనకుఁ జెన్నగు నీవనపల్లవంబు ప
ద్మావిలసత్పదంబుగరిమంబున కెందును దాన మేది ల
క్ష్మీవనమంచు సంస్మృతులు సేయుదు రర్థి సమస్తలోకముల్.

158


క.

ఈవేదశైల మమరఁగ, నావేదశిఖాగ్రవర్తి యగు ననఁగను వి
ద్యావిభవము సాధులకున్, గావించుచునుండుఁ దన్నుఁ గని గొల్వంగన్.

159


క.

వేదనగ మఖిలకల్మష, వేదవినోదమున వేదవేదాంగవిధా
వేదితము విసరభవని, ర్వేదాదివిదితవివేకవేద్యము ధాత్రిన్.

160


ఉ.

ఆగమశృంగశైలములయందు మృగేంద్రసకృద్విభూతి నే
నేగతి నొప్పుదు న్మహిమ యింపుగ శ్రీనరసింహమూర్తిలీ
లాగరిమంబునన్ దనరులాగున నిట్టిడ దీనిమౌళియ
ట్టీగరుడాద్రిపేర్మి నుతియింపఁగ శక్యమె యెట్టివారికిన్.

161


క.

గరుడాద్రి దురితవిషధర, గరుడాకృతి సిద్ధసాధ్యగంధర్వమరు
ద్గరుడాసేవ్యం బుజ్వల, గరుడాయత మస్మదీయకర్మస్థితికిన్.

162