పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్యము. చెన్నపురి విశ్వకళాపరిషత్తునం దాంధ్రభాషకు మకుటాయమానులైన శ్రీనిడదవోలు వేంకటరావు, ఎమ్. ఏ. గారు తెలుఁగు విద్వత్సభవారి సంచికలోఁ బ్రచురించిన రచనలు, నారాయణవనం వకులాభరణము వ్రాసిన సంక్షిప్త సూరిజీవితము, నాస్మృతిపథమున నిలిచిన విషయముల నాధారముగ నేను వారిజీవితమును వ్రాయ సాహసించితిని. ఈ తెగువ కాంధ్రసాహితీపరులు నన్ను మన్నింతురుగాత.

జననము-విద్య

పందొమ్మిదవ శతాబ్దమున వన్నె కెక్కిన తెలుఁగువిద్వాంసులలో పరవస్తు చిన్నయసూరి ప్రథమగణ్యుఁడు. ఒక శతాబ్దమునుండి వీరి “బాలవ్యాకరణ”, “నీతిచంద్రిక”లు పాఠశాలలలోను కళాశాలలలోను నిర్బంధపాఠ్యగ్రంథము లగుటచే నీగ్రంథములను జదువని విద్యార్థు లుండరని చెప్పు టతిశయోక్తి కాఁజాలదు. ప్రాచీనయుగమునఁ బ్రధమ వ్యాకర్తగా, కవిగా నన్నయ వాసికెక్కెను. ఆధునికయుగమున చిన్నయసూరి ప్రఖ్యాతవ్యాకరణనిర్మాతగా నేకగ్రీవముగఁ బరిగణింపబడుచున్నాఁడు. బ్రిటిషు తూర్పుఇండియా కంపెనీవారు రాజధానిలో స్థిరనివాస మేర్పఱచికొనినపిమ్మట, ప్రభుత్వనిర్వహణమునకు వారికి పెక్కురు వ్రాయసకాండ్రు, పండితులు, ఉపాధ్యాయు లవసరమైరి. నాఁటి దేశకాలానుగుణ్యగద్యపద్యరచనకు చార్లెస్, ఫిలిప్, బ్రౌనుదొరవారు పునాది వేసిరి. ఇయ్యది చిన్నయసూరి, చదలవాడ సీతారామశాస్త్రులు, రావిపాటి గురుమూర్తిశాస్త్రి, మున్నగు పండితవరేణ్యుల కుత్సాహజనకమయ్యెను. కళాప్రపూర్ణ శ్రీవజ్ఝల చినసీతారామశాస్త్రిగారు ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారు ప్రచురించిన, “ఆంధ్రవ్యాకరణసంహితాసర్వస్వ”మను గ్రంథములో,