పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"చిన్నయసూరి బాలవ్యాకరణము వ్రాయనిచో, ప్రాచీనవాఙ్మయ మడుగంటిపోయి యుండెడిది" అని వ్రాసిరి.

చిన్నయసూరి చాత్తాద శ్రీవైష్ణవకులస్థుఁడు (సాతాని). వీరి పూర్వీకు లౌత్తరాహులు; బ్రాహ్మణులవలె శ్రీపరవస్తు మతానుయాయులు. వీరికి సూత్రగోత్రములు గలవు. సూరి యాపస్తంభసూత్రుఁడు; గార్గేయసగోత్రుఁడు. ఇతఁడు యజుర్వేది. సూరితండ్రి యుభయవేదాంత శ్రీ వేంకటరంగరామానుజాచార్యులు; శ్రీవైష్ణవమత ప్రచారకులు. మద్రాసునందలి తిరువళ్లిక్కేణి శ్రీరామానుజకూటములో నుసన్యసించుచుండెడివారు. వీరి వ్యాఖ్యానాదులకుఁ జకితులై, ప్రతివాదిభయంకరము శ్రీ శ్రీనివాసాచార్యులు, వీరిని శ్రీ రామానుజ జన్మస్థలమగు శ్రీపెరుంబుదూరునకుఁ గొంపోయిరి. దేవాలయార్చకులలో నొకరుగా నియమింపఁబడి, నిత్యము ద్రవిడదివ్యప్రబంధములను దేవతసమ్ముఖమునఁ బారాయణము చేయుచుండెను. ఇట్లు శ్రీ రామానుజాచార్యులు స్వీయకార్యములను దేవాలయములో నిర్వహింపుచుండ, గాఢమతాన్వేషులగు విద్యార్థిబృందము వారిని గలసికొనుట సంభవించుచుండెను. వీ రావిద్యార్థుల నందఱను శ్రీవైష్ణవులుగ మార్చుచుండిరి. శ్రీరామానుజాచార్యులు ద్రవిడవేదాంతమునందే కాక, సంస్కృతాంధ్రములలోఁ గడుసమర్థులు. విరామవేళలందు విద్యార్థులకుఁ బైభాషలను బోధించుచుండిరి. సూరి జన్మించుటకుముందు శ్రీ రామానుజాచార్యుల వారికి నొక్క పుత్త్రిక మాత్ర ముండెను. ఈమె బాల్యముననే భర్తను గోల్పోయెను. శ్రీ రామానుజాచార్యులు, తన భార్య — వీరిరువురు పుత్త్రసంతానాభిలాషులై, మిత్రుఁడు శ్రీ శ్రీనివాసాచార్యుల సలహానుసారము పుత్త్రకామేష్టి నాచరించిరి. యజ్ఞపాయసము