పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకి నయి నిలిచితిని. అనంతర మొకపుణ్యాతుఁడు నాయందు దయచేసి, 'యిఁకమీఁదట గోవులను మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయు'మని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచికార్యములు చేయుచున్నవాఁడను. వృద్ధుఁడను, బోసినోరివాఁడను. గోళ్లు పోయినవి. లేవ సత్తువ లేదు. నన్ను నీవేల నమ్మవు ? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము చేయవలెనని కోరితిని, సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడికంకణము పుచ్చుకొమ్ము." అనఁగానే వాడు పేరాసచేత దానిమాటలకు లోపడి కొలనిలో స్నానము చేయఁబోయి మొలబంటిబురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూచి 'యయ్యయ్యో పెనుగొంపిలో దిగఁబడితివిగదా! నేను వచ్చి నిన్ను లేవనెత్తెదను. భయపడకు' మని తిన్న తిన్నగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీగతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము ఎవ్వరికైన విధి తిప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.

కాఁబట్టి సర్వవిధముల విచారింపనిపని చేయరాదు. చక్కఁగా విచారించి చేసినపనికి హాని యెప్పటికి రాదు.' అని చెప్పఁగా విని యొకకపోతవృద్ధము నవ్వి యిట్లనియె. 'ఆ! యివి యేటిమాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధునిమాట వినవలసినది. వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర యిట్టివిచారము పెట్టుకోరాదు. కొఱమాలినశంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రతుకవచ్చును?