పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోదావరీతీరమందు గొప్పబూరుగువృక్షము గలదు. అందు నానాదిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనక మనువాయసము మేలుకొని రెండవయమునివలె సంచరించుచున్న కిరాతకునిఁ జూచి 'వఱువాత లేచి వీనిమొగము చూచితిని. నేఁ డేమి కీడు రాఁగలదో తెలియదు. వీఁడు వచ్చినచోట నిలువఁ దగదు. జాగు చేయక యీచోటు విడిచి పోవలె' నని యత్నము చేయుచుండఁగా వాఁ డావృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వలపన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁ డను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె, 'ఈనిర్జనవనమందు నూకలు రా నిమిత్తమేమి? మన మీనూకల కాశపడరాదు. తొల్లి యొకతెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతిబొందెను. మీ కాకథ చెప్పెద వినుండి.

ఒకముసలిపులి స్నానము చేసి దర్భలు చేతఁబట్టుకొని కొలనిగట్టున నుండి, యోయి తేరువరి, యీపయిఁడికంకణము వచ్చి పుచ్చుకో మని పిలిచి చెప్పెను. ఒకపాంథుఁ డామాటవిని యిది నాభాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె నని చింతించి, యేదీకంకణము చూపు మని యడిగెను. పులి చేయి చాఁచి యిదిగో హేమకంకణము చూడుమని చూపెను. నీవు క్రూరజంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె: "ఓరీపాంథ! విను. మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకము లగుగోవులను మనుష్యులను వధించి మితిలేనిపాపము సంపాదించి