పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకను బలికించుట దుష్కరము గాదు. సద్వంశ మందు గుణహీనుఁడు పుట్టఁడు. పద్మరాగములగనిలో గాజు పుట్టునా? ఎట్టిరత్నమయినను సాన పెట్టక ప్రకాశింపనట్టు బాలుఁ డెట్టివాఁడయిన గురుజనశిక్ష లేక ప్రకాశింపఁడు. కాఁబట్టి నేనాఱుమాసములలో దేవరపుత్రులను నీతికోవిదులను జేసి మీకు సమర్పించెదను.” అనిన రాజు సంతోషించి యిట్లనియె; “పూవులతోఁ గూడిన నారకు వాసన గలిగినట్లు సజ్జనులతోడ సావాసించు మూర్ఖునకు మంచిగుణము గలుగుట సాజము.” అంతే కాదు. 'సాధుసాంగత్యము సర్వశ్రేయములకు మూలము.' అని సాదరముగా వచియించి యాతనికిఁ బసదన మిచ్చి తన కొడుకులను రప్పించి చూపి “విద్యాగంధము లేక జనుషాంధులవలె నున్నారు. వీరిని గన్ను దెఱపి రక్షించుట మీభార” మని చెప్పి యొప్పగించెను. అనంతర మాబ్రాహ్మణుఁడు వారల నొకరమణీయసౌధమునకుఁ దోడుకొనిపోయి కూర్చుండఁ బెట్టుకొని యిట్లనియె. “మీకు వినోదార్థ మొకకథ చెప్పెద. అది మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధియు నని నాలుగంశములచేత నొప్పుచుండును వినుండు.

మిత్రలాభము

“ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పరమైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించుకొందురు.” అనిన రాజపుత్రులు విని “యేకార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను. మాకు సవిస్తరముగా వినిపింపు" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగెను.