పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడుగాని కడుపు చెఱుపఁబుట్టినవాఁడు పుత్రుఁడు గాఁడు. గుణవంతులలోఁ బ్రథమగణ్యుఁడు గానికొడుకును గన్నతల్లికంటె వేఱుగొడ్రాలు గలదా? గుణవంతుఁడైనపుత్రుఁ డొకఁడు చాలును. మూర్ఖులు నూఱుగురవలన ఫల మేమి? ఒకరత్నములో గులకరాలు గంపెఁడయినను సరిగావు. విద్యావంతులయి గుణవంతులయినపుత్రులను జూచి సంతోషించుట యనుసంపద మహాపుణ్యులకుఁగాని యెల్లవారికి లభింపదు” అని కొంతచింతించి యుంకించి తల పంకించి “యూరక యీచింత యేల? నీపుత్రులు చదువ మనిగా? పరామరిక మాలి తగిన విద్యాభ్యాసము చేయింపనయితిని. బిడ్డలకు విద్యాభ్యాసము చేయింపమి తల్లిదండ్రులదోషము. తల్లిదండ్రులచేత శిక్షితుఁడయి బాలుఁడు విద్వాంసుఁడగునుగాని పుట్టఁగానే విద్వాంసుఁడు కాఁడు. పురుషకారముచేతఁ గార్యములు సిద్ధించును; రిత్తకోరికలచేత సిద్ధింపవు. నిద్రించుసింహమునోరను మృగములు తమంత వచ్చి చొరవు. కాబట్టి యిప్పుడునాపుత్రులకు విద్యాభ్యాసముకయి వలయుప్రయత్నము చేసెద" నని చింతించి యచ్చటి విద్వాంసులతో నిట్లనియె. “నాపుత్రులు విద్యాభ్యాసము లేక క్రీడాసక్తులయి తిరుగుచున్నవారు. ఎవ్వరయినను వీరిని నీతిశాస్త్రము చదివించి మంచిమార్గమునకుఁ ద్రిప్పఁజాలినవారు కలరా?” యనిన విష్ణుశర్మ యనుబ్రాహణుఁ డిట్లనియె. "రాజోత్తమా! యిది యెంతపాటిపని? మహావంశజాతు లయిన దేవరపుత్రులను నీతివేదులను జేయుట దుష్కరము గాదు. కొంగను మాటలాడించుట దుష్కరము గాని