పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుఁడు, నిత్యశంకితుఁడు, పరభాగ్యోపజీవియు ననువారాఱుగురు దుఃఖభాగు లని నీతికోవిదులు చెప్పుదురు.' అనఁగా విని కపోతము లన్ని నేల వ్రాలెను.

గొప్పశాస్త్రములు చదివి మిక్కిలి వినికి గలిగి పరులసంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోఁగొట్టుకొని క్లేశపడియెదరు. ఆహా! లోభ మెంత చెడుగుణము! అన్ని యిడుమలకు లోభము కారణము.

అనంతరము పావురములన్ని వలలోఁ దగులుకొని కపోతవృద్ధమును జూచి ‘నీవు వృద్ధుఁడవు. తెలిసినవాఁడ వని భ్రాంతిపడి నీమాటలను విని యీవిపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వఁడు బుద్ధిమంతుఁడో వాఁడు వృద్ధుఁడుగాని యేండ్లు మీఱినవాఁడా వృద్ధుడు?' అని కపోతములు నిందింపఁగా విని చిత్రగ్రీవుఁ డిట్లనియె. 'ఇది యీతనిదోషము గాదు. ఆపదలు రాఁగలప్పుడు మంచిసహితము చెడు గగుచున్నది. మనకాలము మంచిది కాదు. ఊరక యేల యీతని నిందించెదరు. ఈతఁడు తనకుఁ దోఁచినది చెప్పినాఁడు. అప్పుడు మనబుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొనుసాధనము విచారింపవలెఁగాని యీమాటలవల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుషలక్షణము. కాఁబట్టి యిప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుఁడు. ఇప్పటికి నా కొకటి తోఁచుచున్నది. మీరందఱు పరాకు లేక వినుఁడు. ఒక్కసారిగా మనమందఱము వల యెత్తుకొని యెగిరిపోవుదము. మన మల్పులము; మన కీకార్యము సాధ్యమవునా యని విచారింపఁ బని లేదు. సంఘీభవించి యెంతటికార్యమయిన సాధింప