పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మెలఁగుదెస మెలఁగి క్రమ్మఱు, తల నొకమరి యేమఱించి దాడిమెయిన్ దో
ర్బలము మెఱసి పై పడి నా, చలము నెఱపి పోదు మీకుఁ జాటితిఁ జుండీ.

31


క.

అని దుర్మదాంధకార, మ్మునఁ గానక బిట్టు పలికి పోయెను గలని
స్వనకోకిలకర్బురకా, ననరేఖావంధ్యవింధ్యనగమున విడియన్.

32


మ.

చని దైత్యేంద్రుఁడు తత్ప్రదేశమునఁ జంచత్కాంచనాంభోజధూ
ళినితాంతప్రవిలిప్తహంసకులకేళీజాతసంధ్యాభివం
దనలోలప్రతిజాలమౌగ్ధ్యమున మోదస్థాన మై లోకపా
వనతం బేర్చిననర్మదం గని మృదుస్వచ్ఛందలీలారతిన్.

33


తే.

నెమ్మి మజ్జన మొనరించి తమ్మివిరులు, సాలఁ గోయించి హృద్యవిశాల మైన
పులినతలమున శివలింగపూజ సేయఁ, దొడఁగె నట నర్జునుండును బడఁతిపిండు.

34


క.

వనశైలీకౌతూహల, మునఁ దగిలినయట్టివారు ముదితహృదయు లై
వనిఁ బరిచితస్థలములకుఁ, జని హృద్యవిహారతంత్రచాతుర్యమునన్.

35


మ.

లలితక్రీడమెయిన్ సముత్కటమదోల్లాసంబునం బెక్కుభం
గులఁ జేతోరమచూతపోతలతికాగుల్మప్రదేశంబులం
గలయం గ్రుమ్మరి సొడ్మునుం జెమట నంగంబుల్ నవాంకూరసం
కలనాశోభితవల్లరీనిభము లై క్రాలంగ రాగిల్లుచున్.

36


క.

ముదమున జలకేళికి నర్మదకుం జనుదెంచి లలితమకరవిహారా
స్పదతత్ప్రవాహమున నిం, పొదవఁగ నాడునెడ నధిపుఁ డుల్లాసమునన్.

37


తే.

బాహువులు సాఁచి పడమర పాఱుచున్న, యాతరంగిణిఁ బోకుండ నాఁగుటయును
నెదురుదొట్టి దశాననుఁ డీశుఁబూజ, సేయునెడ ముంచికొనియె నచ్చెరువు గాఁగ.

38


క.

రావణుఁడు సంభ్రమంబున, దేవార్చనకొఱఁతతో నది వెడలి కలయన్
భావించి యెదురు క్రమ్మెడు, నావెల్లువఁ జూచి విస్మయం బెదఁ గదురన్.

39


క.

తూర్పుదెస వచ్చు నీనది, దర్పంబున నెదురురాఁ గతం బేమియె మీ
రేర్పడ నెఱింగి రం డని, శూర్పణఖాభ్రాతచరులఁ జూడఁగ నంపెన్.

40


ఆ.

వార లరిగి విభుఁడు వామలోచనలును, జలవిహార మర్థి సలుపు చునికి
చూచి వచ్చి యానిశాచరవల్లభు, నెదుర నిలిచి మ్రొక్కి యిట్టు లనిరి.

41


క.

దేవా దేవర పంపిన, నీవెల్లువతెఱఁ గెఱింగి యేతెంచితి మె
చ్చో వినఁగఁ జూడఁ బడయమ, యావిధ మద్భుతరసావహంబై యుండెన్.

42


ఉ.

భూరిబలాభిరాముఁడు విభూషణభూషితమూర్తి కామినీ
స్మేరముఖేందుబింబముల చెన్నున నుజ్జ్వలచంద్రలోకకే
లీరతి నున్నచందమున లీలమెయిన్ సలిలావగాహన
స్ఫారకుతూహలుం డయి విశంకత నొక్కఁడు కేలి సల్పెడున్.

43