పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అరుగుదెంచి మాహిష్మతీపురము సుట్టి, వేగ పోరికి నర్జును వెడలు మనుఁడు
రావణుఁడు వచ్చె నలఁతులఁ బోవఁడనుచు, గోపురాంగణస్థితజనక్షోభ మెసఁగ.

19


క.

పన్ని బహిరంగణంబున, నున్న నసంభ్రాంతిగతి సముచితమ్ముగ నా
సన్ను లయి మంత్రు లి ట్లని, రన్నరపతిపెంపునన్ భయం బెద లేమిన్.

20


చ.

అధిపతి వీట లేనిసమయంబున సంగరకాంక్షతోడ ని
ట్లధికబలంబులం గొని వృథాతిశయంబుగ నేగుదెంచి యి
వ్విధమునఁ బన్ని నీ వనృతవిక్రమముం బ్రకటించుకంటె నం
బుధినడు మైన నీపురికిఁ బోయి యొదుంగుము చాల మే లగున్.

21


చ.

అనుబలుమాట లియ్యకొని యద్దనుజేశ్వరుఁ డాతఁ డున్న వాఁ
డని యని సేయు వేడుక రయంబున వచ్చితి నెందుఁ బోయె మీ
జనపతిలావు నాదుభుజశక్తియు నించుక తూఁచి చూడ కేఁ
జన నెఱిఁగించి యియ్యెడకుఁ జయ్యనఁ దోకొని రండు నావుడున్.

22


ఆ.

అతనిపెంపుఁగలిమి కయ్యమాత్యులు దమ, నెమ్మనమ్ముల మెచ్చి నృపతివృత్త
మున్నరూపు సెప్పి యిన్నరభోజను, నిచట నునుత మనుచు నిట్టు లనిరి.

23


క.

వారువము నెక్కి వనితలు, గారవమునఁ గొలువఁ గంతుకైవడి వెడలం
జేరక యంతంతను బరి, వారము నిలువఁ బడ వర్షవరపరివృతుఁ డై.

24


క.

సరసకవివిటవిదూషక, పరిహాసకగాయకాదిపరిజనములు వే
సరుటపయి మేలు దొలఁకెడు, తురగము నెడఁ దూఱఁ గాంతి దొలఁకాడంగన్.

25


ఉ.

చూడ్కికిఁ బండు వై ముదము సొంపునఁ జూపఱు సొక్కుచుండ ని
మ్మాడ్కి నరేశ్వరుం డరిగె మాపటికిం జనుదెంచు నాతనిం
దోడ్కొని తేరఁ బూను టది దుర్వినయం బగు మాకు రాజులన్
వేడ్క మెయిం జరింపఁ జని వీటికి ర మ్మని పిల్వవచ్చునే.

26


క.

నటదలికులశుకపికసం, కటలీలోద్యానములను గమనీయసర
స్తటినీతటాకముల ను, త్కటకౌతుకవృత్తి నాడుఁ దరుణులుఁ దానున్.

27


క.

ఎయ్యెడ నిలుచుట యెఱుఁగమ, యియ్యెడ నేఁ డీవు విడియు మెల్లి యతనితో
నియ్యకొని యెల్లభంగులఁ, గయ్యము సేయంగఁ దలఁపు గలిగినయేనిన్.

28


ఆ.

వేగపడకు మనుజవిభుచేతిబలుపును, జూతు గాక యనిన శూర రేఖ
నగుచు మంత్రివరులమొగములు గనుఁగొని, యిట్టు లనియె దానవేశ్వరుండు.

29


ఉ.

ఏపున నేను వచ్చుటయు నిచ్చట నిల్చుట కోహటించుటన్
మీపతి యెక్క డేనిఁ జన మిన్నక మాటలు పేర్చినన్ రణా
టోపము మాన నేర్తునె కుటుంబసమేతము డాఁగె నాతనిం
జూపరు మీరు నింకఁ దలసూపఁ డతండును బోయి వచ్చెదన్.

30