పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్లీల వెలుంగ నేగిన నరిప్రకరంబులచేత నెమ్మెయిం
గాలవశంబు నొందక యఖండితవిక్రమశాలి నయ్యెదన్.

9


ఉ.

హోమసమాప్తి నుత్థితరుథోత్తమ మొక్కటి దక్క నొంట సం
గ్రామము సేయఁబో నది యకాలముగా దుది కియ్యకొంటి నా
కీమెయి మేర పెట్టి వర మిమ్ము పరాక్రమలీల మెచ్చి నీ
వేమియు నీక పోక తగ వేనియుఁ బొ మ్మమరేంద్రు నిచ్చితిన్.

10


తే.

అనుడు దరహాసచంద్రిక తనదువదన, కమలవనమున కభినవకాంతి యొసఁగఁ
జిత్రచారిత్రుఁ డగుదితిపుత్రపుత్రు, నర్థిఁ గనుఁగొని యవ్వర మతని కిచ్చె.

11


చ.

అడిగినయట్ల యిచ్చిన దశాననసూనుఁడు ప్రీతి మేన నె
ల్లెడ వెలిఁ బేర్చె నాఁ బులక లెంతయు వింతగ మ్రొక్కి పెంపు సొం
పడరఁ గులం బెలర్ప జనకానుమతంబున నాబలారికిన్
విడుగడ సేసె నప్పు డరవిందభవుండు ప్రమోద మందఁగాన్.

12


ఆ.

అంబుజాసనుఁడు దశాననుఁ జూచి నీ, నందనునకుఁ ద్రిభువనముల నెగడ
నింద్రజిత్సమాఖ్య యిచ్చితి సుముఖులై, యుండుఁ డనియె దనుజు లుల్లసిల్ల.

13


చ.

అసురుల నిమ్మెయిం బ్రముదితాత్ములఁ జేసి పయోజసూతి సం
తసమున నాకలోకపతిఁ దోకొని పోవునెడం దదీయవ
క్త్రసరసిజంబు లజ్జ యనురాత్రి గడం జెడి యున్కికిం గృపా
రసపరుఁ డై హితార్హమధుకరస్ఫుటసత్యమృదూక్తి ని ట్లనున్.

14


చ.

తమతమదుష్కృతంబు సుకృతంబును నాపదయున్ శుభంబు లై
తముఁ దఱి యైనఁ బొందు నది దప్పునె సాధ్వి నహల్యఁ గోరి గౌ
తమునికిఁ దప్పి తీ వకట తత్ఫల మీయశుభంబు దోషసం
గమనినివృత్తికై యొకమఖం బొనరింపుము విష్ణుతుష్టిగన్.

15


క.

అని చెప్పి పోవుటయు న, య్యనిమిషవల్లభుడు విష్ణుయాగం బొనరిం
చి నిఖలదురితరహితుఁ డై, చనియెన్ దివంబునకు విశాలవిభూతిన్.

16


మ.

అనినం జిత్తము చోద్య మంద రఘువంశాధీశ్వరుం డిట్టు లా
తనికిన్ బీరము సెల్లెఁ గాని యెచటం దద్విక్రమక్రీడ మా
న్ప నొకం డైనను జాలఁడే యనుడు భూపాలాగ్రణిం జూచి య
మ్ముని మందస్మితసుందరుం డయి మనోమోదంబుతో ని ట్లనున్.

17

రావణుఁడు కార్తవీర్యునితోఁ బోరాడి చెఱఁబడుట

ఉ.

నిర్జితశత్రుఁడున్ భువననింద్యచరిత్రుఁడు నైన రావణుం
దూర్జితవిక్రమస్ఫురణ నుర్విఁ జరించుచు మించి యేచి శౌ
ర్యార్జనలోలబాహుమహిమాస్పదుఁ డై చనునాసహస్రభా
హార్జును పెంపుసొంపు హృదయంబున సైఁపక వచ్చె నాజికిన్.

18