పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

సప్తమాశ్వాసము




రంజకత్వచతురా
చారుఁడు వర్ణాశ్రమప్రచారుఁడు విద్యా
ధౌరేయుఁ డార్యవినుత
ప్రారంభుఁడు మనుమమానవాధీశుఁ డొగిన్.

1

బ్రహ్మ యింద్రజిత్తు కోరినవర మిచ్చి యింద్రుని విడిపించుకొని వచ్చుట

క.

అక్కడఁ గమలాసనుఁ డా, రక్కసుఁ డమరేంద్రుమీఁద రాకయు సమరం
బెక్కుడుగఁ జేసియును హరి, యుక్కఱి పట్టువడిపోకయుం దెలియంగన్.

2


చ.

విని మునిబృందముల్ గొలువ వేగమ లంకకు నేగుదెంచి య
ద్దనుజవిభుండు సేయు నుచితప్రతిపత్తిఁ బ్రియంబు నొంది యా
తనిదృఢశౌర్యముం దనయుదైర్యమునుం గొనియాడి వెండి యా
యనిమిషనాథు గెల్చిన జయాతివిశేషము సూపి చెప్పుచున్.

3


ఆ.

భువనములకు నెల్లఁ బ్రోదిగ శతమఖుఁ, దాను నిలుపుటయు నతండు లేమి
సకలభూతములకు సంకటం బగుటయు, నెఱుఁగఁ జెప్పి వారియిచ్చ యెఱిఁగి.

4


చ.

ముదమున నింద్రుబంధనమోక్షము సేయుఁ డభీష్టవస్తు వి
చ్చెద మదికోర్కి యేర్పడఁగఁ జెప్పుఁడు నా కనుచున్ సముల్లస
ద్వదనచతుష్టయుం డయిన వారిజసంభవుఁ జూచి వాంఛిత
ప్రదుఁ డగు టాత్మలో నెఱిఁగి రావణసూనుఁడు ప్రీతి నిట్లనున్.

5


క.

కమలాసన విను నావి, క్రమమున వెల పెట్టెదేనిఁ గారుణ్యము సే
యుము నాకు శాశ్వతం బగు, నమరత్వం బనిన నతని కజుఁ డి ట్లనియెన్.

6


క.

ఆశ్వాసంబుగ బలికిన, విశ్వాసము సేసి మున్ను వేడితి కలదే
శాశ్వత మగునమరత్వం, బీశ్వరుఁ డొకరునిక తక్క నితరుల కెందున్.

7


క.

అనుడు నొకతెఱఁగు సెప్పెద వినుఁ డని రావణసుతుండు వినయవిశేషా
వనతశరీరుఁ డగుచు ని, ట్లనియెం గరకమలముకుళనాదరపరుఁ డై.

8


ఉ.

ఆల మొనర్పగా వలయునప్పుడు వహ్ని నుపాస్తి చేసి యా
వేలిమి నొక్కతేరు ప్రభవించిన గ్రక్కున దాని నెక్కి దో