పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణుఁ డింద్రునిఁ బట్టి లంకకుఁ గొనిపోవుట

చ.

అరదముమీఁదఁ బెట్టుకొని యాతనిఁ దండ్రికిఁ జూపి యింక సం
గర మిది ఏటికిన్ జయము గైకొని పోదము రమ్ము నావుడుం
గరము ప్రియంబునం దనయుఁ గౌఁగిటఁ జేర్చి త్రిలోకరాజ్యవి
స్ఫురణము నాకు దక్కె నని పొంగి దశాస్యుఁడు మిన్ను వ్రేయుచున్.

145


ఉ.

మోదమునం దనూభవుని ముంగలిగా నడపించి తాను దు
ర్భేదబలాన్వితుం డగుచుఁ బింగలి యై చన దేవకోటి శౌ
ర్యోదయలీలఁ గూడుకొని యొండొరుఁ బల్కుచు శక్రమోక్షణా
హ్లాదము గోరి పెంపున రయం బెసఁగం బఱతెంచి తాఁకినన్.

146


ఉ.

ఎత్తెల గొందుదిక్పతుల నిందఱ ముంద ఱెఱుంగనట్ల యీ
తత్తబడం బిఱిందిదెసఁ దాఁకిన దీనికి సంభ్రమంబు మై
నిత్తల కేగుదేవలవ దేడ్తెఱఁ బొమ్మని చెప్పి పుచ్చినం
జిత్త మెలర్పఁగా సుతుఁడు శీఘ్రమునం జనఁ దా నుదగ్రుఁ డై.

147


క.

బకమరి తిరిగిన నమరులు, పికపిక లై పోవ లావుఁ బెం పేర్పడ సే
నకు వెనుకై చనియెను లం, కకు దానవవిభుఁడు బాహుగర్వోద్ధతుఁ డై.

148

ఆశ్వాసాంతము

మ.

అతులౌదార్యుఁ డహీనశౌర్యుఁడు సముద్యద్ధైర్యుఁ డత్యంతవి
శ్రుతచారిత్రుఁడు సూరిమిత్రుఁడు జనస్తోతవ్యగోత్రుండు సం
భృతసత్కీర్తి పవిత్రమూర్తి యసుహృద్బృందార్తినిర్వర్తి పూ
జితధీమంతుఁడు పుణ్యవంతుఁడు జయశ్రీకాంతుఁ డిమ్మేదినిన్.

149


క.

సన్మార్గచతురపథికుఁడు, జన్మవిశేషప్రసిద్ధసగరకులుఁడు భూ
భృన్మకుటఘటితచరణుఁడు, మన్మథనాథుఁడు కవీంద్రమందార మిలన్.

150


మాలిని.

నిరుపమజయలక్ష్మీనిత్యవిస్తారవక్షుం
డరిబిరుదమహోత్సాహప్రతిక్షేమదక్షుం
డరుణకిరణదీప్తవ్యాప్తపద్మాయతాక్షుం
డురగశయనరేఖాయుక్తసంరక్షుఁ డుర్విన్.

151


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయ ప్రణితం బైనయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు షష్ఠాశ్వాసము.

————