పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆతతబహుబాహుం డగు, నాతఁడు సేతులఁ బ్రవాహ మాఁగిన మరలం
దోతెంచె నావుడును విని, వీతభయుఁడు కార్తవీర్యవిభుఁ డని యెఱిఁగెన్.

44


చ.

ఎఱిఁగి కరంబు వొంగి కడునేకత మి ట్లగపడ్డచో నతం
డెఱుఁగక యుండ ముట్టికొని యే పడఁగించెద నంచు మంత్రులం
దఱకు నెఱుంగఁ జెప్పికొని దానవుఁ డున్మదుఁ డై చనంగ న
త్తఱి నరుణాభ్ర మస్థిమయధారలతో దివిఁ దోఁచె ముందటన్.

45


ఉ.

దానికి శంక సేయక యుదగ్రరణోత్సుకుఁ డైనయట్టియా
దానవవల్లభుండు బలదర్పసముద్భటసంకులంబుగా
సేనలు ముందటం దఱుమ శీఘ్రత మేదిని సంచలింపఁ గాం
తానిచయంబుఁ గంచుకివితానము బెగ్గిల బిట్టు ముట్టినన్.

46


మ.

వనితాబృందములోన నున్నపతి తీవ్రక్రోధుఁ డై గంగ గా
హనకేలిం బిడియేనుఁగుల్ వొదువ మోదాయత్త మై యుండి గ్ర
క్కున నన్యద్విపదానగంధమునకుం గోపించునైరావతం
బును బోలెన్ మడు వల్గ వెల్వడి రణప్రోత్సాహయోగ్యస్థితిన్.

47


క.

కట్టాయిత మై యువిదల, నిట్టుండుఁడు వెఱవ కిచట నిదె వచ్చెద నన్
ముట్టినదానవులను బలి, వెట్టెద నర్మదకు ననుచు భీకరవృత్తిన్.

48


చ.

అతఁడు వినూత్నరత్నరుచిరాంగద మై వివిధాయుధప్రభా
న్విత మగు బాహుసంఘమ యనీకముగాఁ బటువిక్రమక్రమో
ద్ధతి దితిసూనుసేనల మదం బఱి నల్గడఁ దూలఁ దోలె ఘో
రతిమిరపుంజభంజనకరప్రకరుం డగుభాను కైవడిన్.

49


క.

తెరలినబలములఁ గని యు, ద్ధురవృత్తిఁ బ్రృహస్తుఁ డతనితోఁ దలపడియెం
గరి కేసరి హరిణము పులి, నురగము గరుడిఁ దలపడ్డయొ ప్పమరంగన్.

50


క.

తాఁకి ముసలమున వ్రేసిన, వీఁక నొడిసిపట్టి యతఁడు వెసఁ దిగిచిన నా
రోఁకలి తనచే వచ్చిన, నాఁక గొనక దాన నసుర నడిచెం గడఁకన్.

51


ఉ.

ఆటున మూర్ఛవోయినఁ బ్రహస్తుఁ గనుంగొని యింకఁ దాఁకినం
గీ టడఁగించు నర్జునుఁడు గేవలుఁడే యని భీతచిత్తు లై
మేటిమగల్ సలం బెడలి మేమెయి మార్కొన లేక పాఱినం
గాటుకకొండవోలె దశకంఠుఁ డెదిర్చె మహీమహేంద్రునిన్.

52


ఉ.

వీరగుణాభిరాము లగువింశతిబాహుసహస్రబాహు లా
తారకకార్తికేయులవిధంబున నాబలనిర్జరేశ్వరా
కారత నమ్మురాచ్యుతులకైవడిఁ బెద్దయుఁ బ్రొద్దు మేమెయిం
బోరిరి చూచుఖేచరులు భూరిబలంబుఁ జలంబు మెచ్చఁగన్.

53