పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

దళము లొండొంటిసందులను సమాలోలవలయంబు సడల మవ్వంబు గదిరి
యడరి కర్ణికలలో నంటినకేసరంబులు దల మెక్కుచుఁ బొదలఁ బొంగి
సుడిగొని వెడలంగ గడఁగుక్రొత్తావి యల్లన మీఁది కెగయఁగ మొనలు విచ్చి
యొండొండ మకరంద ముప్పొంగి నలుగడ నిండి పైఁ బొరలంగ నెఱయ విరిసి


ఆ.

మధుకరములఁ గలసిమలసియుఁ దమలోన, లలితగంధవహుఁడు సెలిమి సేయఁ
గమల సంతసమునఁ దమయంద వసియింపఁ జాల నుల్లసిల్లె జలరుహములు.

89


చ.

అరదము నెక్కి లోచనసహస్రము కాంతి వెలుంగఁ బొల్చు ని
ర్జరపతిఁ గన్నులారఁ గని సంతసమందెడువారితోడి మ
చ్చరమున నెక్కె నా నుదయశైలముమీఁద సహస్రదీధితి
స్ఫురణ దలిర్ప నొప్పురవిసొంపున జృంభణ మొందె నబ్జముల్.

90


తే.

అప్పు డసురేంద్రుసైన్యంబు లమరపురము, దవ్వులే దంచుఁ గట్టాయితంబు సేసి
కూడి నైరృతి యారణక్రీడ కమరఁ, బడగ లంతంతఁ గ్రాలంగ సిడము నొప్ప.

91


క.

పదపదఁ డంచు దిశలు గ్ర, క్కదలఁగ లేయెండచాయఁ గడునుగ్రము లై
యెదురం గొందఱు గల రని, మది నించుక సరకుగొనక మదమున నడచెన్.

92


ఉ.

చిత్రముఁ జూపిన ట్లసురసేనలు దుర్దమలీలఁ గిట్టినన్
వృత్రవిరోధిసైన్యమును విక్రమసంపద సొంపు మీఱ లో
కత్రయపూజ్యుఁ డవ్వసునికాయమునందుఁ బ్రసిద్ధుఁ డైనసా
విత్రుఁడు మున్నుగాఁ గడఁగి వీఁక నెదిర్చెఁ జెలంగి యార్చుచున్.

93

దేవదానవసేనలు పరస్పరము తలపడి పోరుట

క.

ఉభయబలముఁ దలపడి లో, కభయంకరభంగిఁ బోరఁగా రక్తనదుల్
ప్రభవించె నంబుచరస, న్నిభ మైనయమిత్రగాత్రనికరం బడరన్.

94


ఆ.

దనుజబలము నొచ్చి వెనుకకు జరగ న, కంపనప్రహస్తఖరనికుంభ
దూషణప్రచండధూమ్రాక్షశుకసార, ణాదిసుభటకోటి యార్చి తాఁకె.

95


శా.

ఆవీరావలి కీడఁ బోక మహనీయస్థైర్యసారంబునన్
దేవానీకము కుంతఖడ్గపరిఘాదిప్రౌఢి దుర్వార మై
సావిత్రోద్భటబాహువిక్రమకళాసాహాయ్యసంజాతశౌ
ర్యావేశంబునఁ బోరె రౌద్రరసదృప్తాకారఘోరంబుగాన్.

96


క.

అమరులు వోరుట దానవ, సమితికి భర మగుడు సరభసంబున నిజనా
మము ప్రకటించి యదల్చుచు, సుమాలి సావిత్రుఁ దాఁకె సురలు దలంకన్.

97


మ.

పటువేగంబున శాతభల్లచయసంపాతంబునన్ మింట మి
క్కుట మై సర్వధగద్ధగీయ మగుచుం గోపంబు రూపంబు లై
చటులక్రీడఁ జరించున ట్లిరువురున్ శౌర్యోన్నతిం బోరి రు
త్కటదర్పోద్ధతు లై పరస్పరజయాకాంక్షాప్రచండంబుగన్.

98