పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ధనపతి యన్న యే నతనితమ్ముఁడ నానలకూబరుండు నా
తనయుఁడ యింత నిక్కువము దానికిఁ గా దన నాకు నప్సరో
వనితలు వింత యైరె యనివారణ నె ట్లయినం జరించునీ
వును గులభామవోలెఁ దగవున్ ఘటియించెదు వైశికంబునన్.

69


క.

విచ్చలవిడియై యున్నెడ, మెచ్చక ననుఁ ద్రోచి పోవ మేలే తమకం
బచ్చువడునట్లుగా సిరి, వచ్చిన మోఁకాలు సూపువారుం గలరే.

70


క.

నాకంటె మిగులువిటు నీ, లోకమునన కాదు దిగువలోకంబులఁ బై
లోకముల వెదకఁ బోయిన, నీకుం బడయంగ వచ్చునే హరిణాక్షీ.

71


ఉ.

నావుడు నమ్మృగేక్షణ మనంబున రోయుచు నేను లంజియం
గావుడు వానితోడి తమకం బది లంజియ గాదు ప్రేమస
ద్భావ మెఱుంగ వైతి గుణభాగివి పో నినుఁ గోర్కి సెందునే
నీవచనంబు త ప్పకట నీళ్లు లపట్టున నేయి మందొకో.

72


క.

అని మొగమోడక విరసవ, చనముల భంగింప నాదశముఖుం డున్మ
త్తునిగతి నంతయు వినియును, విననిచెవులు సేసి లావు వెరవును మెఱయన్.

73


క.

అంగనఁ బొదివి సగాఢా, లింగనముగఁ దామ్రచూడలీలాచతురా
నంగక్రీడాసంగతి, నెంగిలి గావించె మదము నేడ్తెఱ మిగులన్.

74


సీ.

పగరాజు పైవచ్చి బలువిడిఁ బరిభవించినఁ దలంకినపురశ్రీవిధమున
సమదద్విపము కేళి సలిపినఁ జాల నలంగినయుద్యానలక్ష్మికరణి
ఘనలులాయము సొచ్చి తనయిచ్చ నాడినఁ గలఁగిననెత్తమమి కొలనిభంగిఁ
గడుబెట్టిదపుగాలి సుడిసిన నెఱి దప్పి తిరిగినమవ్వంపుఁదీఁగెమాడ్కి


తే.

మున్ను గైసేసి యలవడ్డ చెన్ను దప్పి, యెలమిఁ బ్రియుపాలి కేగెడులలి యడంగి
వేఱచంద మై యెంతయు విన్న నయ్యె, నసుకు గారించి విడిచిన నమ్మృగాక్షి.

75


క.

వెలవెలఁ బాఱుచుఁ గొంకుచుఁ, దలరుచు నడఁ దొట్రుపడుచు దలఁకుచుఁ దనలోఁ
బలుకుచు నెడనెడ నిలుచుచు, నలకూబరుకడకు నింతి నలఁగుచుఁ జనియెన్.

76

నలకూబరుఁడు రావణుని శపించుట

చ.

చని ధరఁ జాగి మ్రొక్కి తనచందముఁ జూచి విషణ్ణుఁ డైనయా
తని కఱ లేక చెప్పిన నతండు ప్రభావమునన్ సమస్తముం
గని కలుషించి యింక దశకంధరుఁ డెవ్వతె నైన నీక్రమం
బునఁ బయిఁ బడ్డ నప్డ మృతిఁ బొందఁ గలం డని శాప మిచ్చినన్.

77


ఆ.

తివిరె నంబరమున దేవతూర్యరవంబు, గురిసెఁ బుష్పవృష్టి సురగణంబు
సంతసిల్లె దీని నంతయు నేర్పడ, వినిన సతుల కెల్ల వెఱపు వాసె.

78


క.

నలకూబరుశాప మెఱిఁగి, యెలమి దఱిఁగి పంక్తివదనుఁ డిది మొదలుగఁ దా
బలిమిం బైపడ నెన్నఁడుఁ, జెలువల నని నిశ్చయించె జిత్తములోనన్.

79