పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

అప్పు డొకర్తు గొంచెమగునాభరణంబులు సన్నపూఁతయుం
గొప్పిడి త్రిప్పిలోఁ జెరివికొన్న నడంగినపూవులుం బయిం
గప్పినచేలకొంగు నునుఁగప్పును మెల్పున నేగు మెట్టెలేఁ
జప్పుడు చెన్నుఁ జేయుగతిచందము వింతగఁ బోవు నయ్యెడన్.

58


మ.

కని వేగంబున నడ్డ మేగి యతఁ డాకంపించునక్కాంతకే
లను రాగంబునఁ బట్టి యెవ్వతెవు నీ వత్యంతకౌతూహలం
బున నెచ్చోటికిఁ బోయె దన్న నది యంభోజంబుచందాన నా
నన ముజ్జృంభణ మందఁ బెంజెమట మేనం గ్రమ్మఁగా నిట్లనన్.

59


చ.

అతులితధైర్యసారకరుణాలయమానస యేను రంభ నా
పతి నలకూబరుం డతనిపాలికిఁ బోయెద నన్యచిత్త యై
యతివ సనంగ నెందు నిటు లడ్డము వత్తురె నాదు పేరుఁ బో
వు తలఁపు వింటి పాయు నగవుం దగుమాత్రయ కాక యొప్పునే.

60


క.

పొలఁతుక యిమ్మెయి నేర్పడఁ, బలుకఁగ వెండియును మరునిబాణంబులకుం
గొలఁ దై యొప్పనివేడుక, చులుకఁదనము సేయు నయ్యసుర యిట్లనియెన్.

61


చ.

పడఁతుక యేను రావణుఁడ బాహుబలంబున నింద్రువీటిపై
నడచుచు నుండి యిన్నగమునన్ విడియించితి సేన నిప్పు డి
య్యెడి కలవోక వచ్చి సొగయించువిధంబునఁ బోవుచున్న నిన్
బొడగని కాముబల్మతకముల్ నను నిమ్మెయి వెఱ్ఱిఁ జేసినన్.

62


ఉ.

చిక్కితి నిష్టభోగములు సేకుఱుఁ బెంపును దేజ మెక్కఁగా
డక్కినబంట నైతి నొకటం గొద లేక జగంబు లెల్ల నీ
వెక్కటి యేలు మన్న హరిణేక్షణ పంక్తిముఖుండ వేని నే
నక్కట నీకుఁ గోడలఁ గదయ్య తొలంగు తొలంగు నావుడున్.

63


ఆ.

కొడుకు పెండ్ల మైన గోడలు గాక పూఁ, బోఁడి యిట్లు దెరువె పోయిపోయి
నీవు మాట లాడ నేర్తు గదా యని, యెట్టు లేని నాడు టిది క్రమంబె.

64


క.

అనిన నసురేంద్రు పలుకులు, విని నవ్వుచు మీర లొక్కకవిశ్రవసునకున్
జనియించుట యెఱుఁగనె యా, ధనదుండును నీవు నన్నదమ్ములు గారే.

65


క.

అతనికొడుకు నీకును గొడు, కతనిసతిని నీకుఁ గోడ లని నైజము చె
ప్పితిఁ గాక తప్పు గలదే, యతఁడు నతఁడు నీకు మాన్యు లగుదుర కాదే.

66


క.

ఏ నీకు భక్తి సలుపం, గా నుపలాలనము సేయఁగలవాఁడవు నీ
వీనెఱితప్పినమాటలు, దానవకులనాథ యిట్లు దగునే యాడన్.

67


క.

అని రంభ సిగ్గుపడఁ బల్కిన దానికిఁ గొంకుకొసరు లేక దశముఖుం
డనుమానింపక యిట్లను, మనసిజదందహ్యమానమానసుఁ డగుచున్.

68