పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తడఁబడ నొండొంటికి ము, న్నెడఁ గముచుచు నొడిసికొనుచు నేపునఁ బైపైఁ
బడుచు నవు లవుల నీసునఁ, గడచుచు వెన్నెలఁ జకోరగణ మానునెడన్.

49


క.

తినుగమి నొల్లక యొకయెడఁ, దనయిచ్చకు వచ్చునిందుధామనికాయం
బున మవ్వ మెక్కి నిగిడెడి, కొనలు గమిచి మేసె నొకచకోరము దివుటన్.

50


ఉ.

సమ్మదవారి గన్గడలఁ జాలుగ మై గరుపార నిందుబిం
బమ్మున దృష్టి నిల్పి పయిఁబ్రాఁకుమరీచుల నూఁగునూఁగులేఁ
గొమ్మలు పట్ట చంచుపుటకోటిఁ గదల్చి తెమల్చికొంచు సౌ
ఖ్యమ్మ విహంగమ మ్మయిన యాకృతి నొందెఁ జకోర మొక్కెడన్.

51


చ.

కలయఁగ నూనునట్లుగ జగంబు సమస్తముఁ జాలఁ దోఁగెనో
జలజభవుండు గోరి పెఱచాయల నెల్లను మాన్చి యెందునుం
దెలుపు ఘటించెనో యమృతదీధితి వేడుక విశ్వరూపుఁ డై
నిలిచెనొ నాఁగ నెల్లెడల నిండఁగ వెన్నెల పర్వె సాంద్ర మై.

52


క.

వెన్నెలపోతపనులొ యన, వెన్నెలగండరువుపనులవిధమున మీఁదన్
వెన్నెలనీరు వఱపి రనఁ, గన్నుల కిం పొసఁగె నిల సకలరూపములున్.

53


చ.

అలసత యొప్ప నల్లన రతాంతమునం బ్రియునొద్దఁ బాసి నె
చ్చెలికడ కేగుదెంచు సరసీరుహనేత్రవిలోచనంబులం
దలఁకెడుమందహాసము విధంబున సౌంపున మీఱి యున్న చెం
గలువలలోన నింపడరుకౌముది వేడ్క లొనర్చెఁ జూడ్కికిన్.

54


సీ.

భరితసుధారసపాత్రంబు లనుకుముదోత్కరంబులు దళుకొత్త మెఱసి
చంద్రకాంతోపలజలములకాలువ లివి యవి యని యప్పు డేర్పరించి
దెసలు సూడఁగ గుండె దిగ్గనుచక్రసమూహంబునకుఁ దలమునుక లగుచు
నీఁదుచకోరంబు లెగుర వ్రేఁగై యీడిగిలఁబడునట్లుగా దలముకొనుచు


తే.

నంతకంతకుఁ బొంగి మిన్నంది వెల్లి, మిగిలి యెనిమిదిదిక్కులమీఁదఁ బొరలి
జనము లానందమునఁ దేల జగము లెల్లఁ, దొట్టి నిండారువెన్నెల నిట్టవొడిచె.

55


తే.

వివిధవర్ణ మై యసురేంద్రువీడు విడిసి
యుండఁ జంద్రిక పర్వ నక్కొండ యొప్పె
మెఱయుపులితోలు గట్టి మైఁ దఱచు గాఁగ
భూతి యలఁదినభూతేశుపొలుపు దాల్చి.

56

రంభారావణసంవాదము

ఉ.

అత్తఱిఁ జంద్రుఁ జూచు మలయానిలురాకకు స్రుక్కుఁ గామినీ
వృత్తము లాత్మ నెక్కొలుపు వెన్నెలఁ గోరి రమించుచున్న యు
న్మత్తచకోరదంపతుల మచ్చికకున్ మది మెచ్చు లోలుఁ డై
యెత్తినవేడ్కలన్ వెడలి యేకత మేగి దశాస్యుఁ డొక్కెడన్.

57