పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నిక్కముగ నిది చీఁకటియొక్కొ తలఁప, నేమి మాయయొ కాక ము న్నిట్టితిమిర
మెఱుఁగ మెన్నఁడు నా జనులెల్ల బెగ్గ, లించునట్లుగఁ గడు నగ్గలించెఁ దమము.

39

చంద్రోదయచంద్రికావర్ణనములు

తే.

యామినీకాంత మృగమద మలఁది మలయ, జమునఁ దిలకంబుఁ బెట్టినచంద మగుచు
నిఖిలదిక్కులఁ దిమిరంబు నిండియుండ, నలఁతియై ప్రాఙ్ముఖంబునఁ దెలుపు దోఁచె.

40


క.

రావణుఁ డమరులమీఁదం, బోవుట విని యతనితోడి పురుడునకుం బాం
థావలిపై వెస వచ్చెం, గావలయు ననంగ నమృతకరుఁ డుదయించెన్.

41


సీ.

చిత్తజుచిగురులం జిత్రంబుగా నిడ్డ లలితతమాలపల్లవ మనంగ
రతిపుమాణిక్యదర్పణమున నూనిన కమనీయమృగమదకణ మనంగ
వెడవిల్తులీలారవిందంబుమీఁదికిఁ దివుటమై నెరఁగినతేఁటి యనఁగ
వలరాజుసిందూరతిలకంబులోఁ జెలువొందు కాలాగరుబిందు వనఁగ


ఆ.

నుదయరాగమహిమ నుజ్జ్వలం బైనబిం, బంబునడుము లాంఛనంబు చెన్నుఁ
జేయఁ బూర్వశైలశిఖరదేశంబున, నిందుఁ డొప్పె భువన మెలమి మిగుల.

42


ఉ.

పంబినకెంపుఁ బాసి దివిఁ బ్రాఁకి దిశల్ వెలిఁగించి చంద్రకాం
తంబుల నీరు నేసి కుముదంబులఁ బండువు సేయఁ బంచి య
బ్జంబుల నిద్ర వుచ్చి మరుసాయకముల్ గరసానఁ బట్టి కో
కంబుల నేఁచి లోకముపొగడ్తలు సేకొని చంద్రుఁ డున్నెడన్.

43


క.

బడి చేసినచందంబునఁ, గడువేగం బొకటి నొకటిఁ గదిసి దివిని సం
దడి గా నెంతయు గుంపుగఁ, బడి వెన్నెలకుం జకోరపంక్తులు గవిసెన్.

44


క.

మును మును నెగడెడురశ్ముల, కొన లెల్లం బట్టికొని చకోరంబులు ద్రుం
చిన నచట నచటఁ దుఱఁగలి, గొని పెరిఁగెడుమాడ్కి దలముకొని ప్రభ లెసఁగెన్.

45


తే.

తివిచి నవకంబు దీప్తులు ద్రెంచి యలఁతి
తునియలుగఁ జంచుపుటములఁ ద్రుంచి తల్లు
లాదరంబున నంది యీనఱ్ఱు లెత్తి
ప్రీతిఁ గముచుఁ జకోరంబుఁబిల్లగములు.

46


క.

చంచులఁ గాంతులు వెన్నెలఁ, జించి యమృత ముట్ట నొసఁగు చెన్నునకును రా
గించుచుఁ జవిఁ జొక్కుచుఁ గబ, ళించుఁ జకోరికలు సమదలీలాలస లై.

47


సీ.

క్రమ్మి పైఁ దొరఁగెడు కౌముదితీయంబు సొంపునఁ దనుపునఁ జొక్కి చొక్కి
పచరించుచ ద్రాతపంబు కాలువలలో నడ్డంబుగా నిల్చి యాఁగి యాఁగి
వెల్లువ పెల్లు సూపెడుసాంద్రచంద్రికాపూరంబు గని మదిఁ బొంగి పొంగి
మిన్నులతో రాయు వెన్నెలకరడుల నెఱకలు సడలించి యీఁది యీఁది


ఆ.

చెలఁగి చెలఁగి మలఁగి మలఁగి యల్లల్లన, క్రాలి క్రాలి బిట్టు తూలి తూలి
సమదవృత్తిఁ గేలి సలిపెఁ జకోరచ, యంబు సదలు దమమయంబు గాఁగ.

48