పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కైలాసవర్ణనము

క.

సెలయేఱు వాఱఁ జెలు వగు, శిలపైఁ దజ్జలము దిగుచు సింధురపతి చూ
డ్కుల కొప్పెఁ బుండరీక, స్థలమున మకరంద మానుషట్పదముక్రియన్.

29


చ.

అరవిరిగుత్తులం బొలిచి యల్లనిగాడ్పులఁ దూలు నీలత
ల్దరహసితోదయంబు సవిలాసతనూవలనంబుఁ గల్గుసుం
దరులతెఱంగు గాఁ బతివిధంబున నున్నరసాలపోత మీ
గిరితటభూమికిన్ సరసశైలికి వచ్చినమాడ్కి నొప్పెడున్.

30


క.

మనరాక హర్మ్యతలమునఁ, గనుఁగొనియెడు కామినులమొగంబులు వాతా
యనమునఁ గానఁగ నగుచా, డ్పున నీతమ్మికొల నొప్పె భూధరముపయిన్.

31


క.

ఈవెండికొండశిఖరము, క్రేవఁ దమాలతతి దృష్టికిం బ్రియ మొసఁగం
గా వలఁతి యయ్యె నీల, గ్రీవునికంఠంబుకప్పుక్రియ నందం బై.

32


చ.

అని గిరి రామణీయకమునందు మనం బెలయించి యద్దశా
ననుఁడు బలంబుఁ దత్తటమునన్ విడియింపఁ దలంచి సన్నివే
శనవిధిసూచనార్థము దెసల్ సెలఁగన్ బటుభేరి వేయఁగాఁ
బనిచి మనోహరం బయినపట్టునఁ దా విడిసి బ్రియంబునన్.

33


ఆ.

ఇట్లు విడిసి దానవేంద్రుఁడు బహువినో, దములఁ దగిలి చతురసముచితాల్ప
పరిజనములతోడ గిరితటరమణీయ, తలమునందుఁ గేలి సలిపె నర్థి.

34


క.

మగుడఁ జనుదెంచి యర్హం, బగుగతి మజ్జనముఁ గుడుపు నైనపిదపఁ దాఁ
దగ లోపలికొలువున నిం, పుగ సుఖసత్కథలఁ బ్రొద్దు పుచ్చె సరసుఁ డై.

35


ఉ.

అంత సహస్రపాదుఁ డపరాచలశృంగతటంబు సేరె దు
ర్దాంతుఁడు దానవేంద్రుఁ డమరప్రకరంబు జయింపఁ బోవుచో
నెంతలు పుట్టునో యనుచు నే పడఁగంగఁ దొలంగి కాలుకొ
న్నంతయు దవ్వుగాఁ జని భయం బడరన్ గిరిదుర్గ మెక్కె నాన్.

36


క.

అరుణకరబింబ మస్తశి, ఖరిపైఁ గర మొప్ప బహులకస్తూరీలి
ప్తరుచిరకుచకాశ్మీర, స్ఫురితస్థాపకముచందమున నందం బై.

37


క.

మఱి కొంతవడికిఁ జీఁకటి, తఱ చై తోతెంచె దశవదనునుద్యోగం
బెఱిఁగి నిశాటబలము గ్రి, క్కిఱియం బలుదెసలనుండి యేతెంచె ననన్.

38

అంధకారవర్ణనము

సీ.

ఇది చూడ్కిఁ గప్పిన యంతటఁ బోక తక్కటియింద్రియంబులఁ గప్పకున్నె
యిది వెల్లి గైకొని యేచి యిండ్లులు సొచ్చి దీవియలఁ బొరిగొనఁఁ గవియకున్నె
యిది నేఁడు శశి గెల్చి యెల్లి యేతెంచు నన్నలినాప్తు మార్కొని నిలుపకున్నె
యిది వెలుం గనునామమెల్లను నడిపి యిజ్జగతి నింకెటుఁ దాన నెగడకున్నె